నేటి మినీ బుర్రకథ

Today's mini Bullshitలైంగిక దాడులు ఆగాలి
(తెరలో ప్రధాన కధకుడు, వంతలు ప్రార్ధన అనంతరం గొంతెత్తుతారు)
ప్రధాన కథకుడు : వినరా సోదరా ! విజయం మనదేరా .. తందానా తాన !
వంతలు 1 : అరెరే, ప్రభుత్వాలెన్నో ప్రముఖ చట్టాలు చేసే భళా నంటి భారు తమ్ముడా ! మేలు భళా నోరు దాదాన!
వంతలు 2 : అరెరే, పోలీసులు ఎన్‌కౌంటర్లు చేసారుగా భళా నంటి భారు తమ్ముడా ! మేలు భళా నోరు దాదాన!
ప్రధాన కథకుడు : అరెరే, లైంగికదాడులు ఆపదు ఎందుకు ఈ సమాజం? తందానా తాన !
వం 1, 2 : రామ రామ శ్రీరామ రామా! ఇంత దారుణమా? నేటి ఈ సమాజం లో , ఓ రామ రాఘవా, శ్రీ రామ రాఘవా !
ప్ర. కథ : వినరా సోదరా! వీనుల విందుగా! తధక్క తోం! వీనుల విందుగా! నేటి బుర్రకథ తందాన తాన!
(తెర లేస్తుంది)
వం. 1 : అరెరే! వనితల గాధలు, బాధలు నేడు, వినరా సోదరా!
వం. 2 : అరెరే! వింటే భారతం వినాలి, తందానా తాన ! అరెరే! నేడు వింటే మన మినీ బుర్రకధ వినాలి! తందానా తాన !
ప్ర. కథ : నేటి మన భారతావనిలో తధక్కతోం! మన భారతావనిలో తందానా తాన !
అరెరే! వనితల గాధలెన్నో బాధలెన్నో వినరా సోదరా!
అరెరే! వనితల గాధలు, బాధలు ఎన్నెన్నో సోదరా! తందానా తాన!
అరెరే! నేటి వనితల నిపుణత నైపుణ్యాలేన్నో చూడు! తందానా తాన!
అరెరే! వేలాది మంది వీర వనితలే తందాన తాన! అరెరే! వేలాది వనితలు నేటి సమాజంలో తందాన తాన!
అరెరే! వినరా సోదరా! వనితల గాథలు బాధలు నేడు ! తందాన తాన!
ప్ర. కథ : అరెరే! సింధు నాగరికం, ప్రజాపాలన, పేరు ప్రతిష్టల సమాజం మనది! తందాన తాన!
అరెరే! రామ లక్ష్మణులు సీతా సావిత్రి వంటి సంతులు గల సమాజం మనది ! తందాన తాన!
అరెరే! అష్ట దారిద్య్రంలో ఆకలి చావుల పోలికేకల సమాజం మనది ! తందాన తాన !
అరెరే! అంతం లేని ”లైంగికదాడులు” ఆపదెందుకు ఈ సమాజం నేడు ! తందాన తాన!
వం 1, 2 : తధక్క తోం! తిరిగిట తిరిగిట తోం! తందాన తాన! వాహ్వా.. వాహ్వా.. తాన తందానా తాన!
తరిగిట తరిగిట.. తందాన తాన! వారెవ్వా.. వారెవ్వా..!
పిట్ట కథ – 1
వంతలు 1 : విశాఖ బీచ్‌లో తందాన తాన! సాయంకాల వేళ అంద చందాల జంట రా! భళా భళి!
వంతలు 2 : ఓహో ! భళా భళి ! వింటుంటేనే పళ్ళు పులుస్తున్నాయి రా ! కోనంగీ, తందాన తాన!
వంతలు 1 : ఆ జంటలో అమ్మాయి ”పదహారేళ్ళ వయసు” లో శ్రీదేవి ని మించి పిట పిట లాడే పిల్ల రా ! భళా భళి!
వంతలు 2 : ఆ.. నేనెప్పుడో మూడేండ్ల కిందటే సెట్‌ చేసుకున్నాను రా! కుర్రాడా! భళా భళి!
వంతలు 1 : తరిగిట తరిగిట తోం! మరి ఆ పిల్ల నిన్నోదిలిందా? లేక కోరిన వన్ని ఇవ్వలేక నివే వదిలావ.. బావ? తందాన తాన!
వంతలు 2 : భళి భళి! లేదు లేదు రా! చిన్నోడా వాడు ”పోకిరి” సినిమాలో మహేష్‌ బాబు లాంటోడు తందాన తాన! ఎగరేసుకు పోయాడు రా! బామ్మర్ది తందాన తాన!
వంతలు 1 : అరెరే! అలా అయితే మర్దర్ల కైనా మాంగళ్యానికైనా జంకు గొంకు లేని పిల్లేరా! బావ తందాన తాన !
వంతలు 1, 2 : తరిగిట తరిగిట తోం! తకధిమి తకధిమి తందాన తాన! వినరా సోదరా! విజయం మనదేరా! తందాన తాన!
ప్ర. కథ : అరెరే ! వినరా సోదరా! విజయం మనదేరా! తందాన తాన!
నీతి నియమం, పాతర వేసే మీడియా దొంతరల సమాజం మనది! తందాన తాన !
అరెరే! వావి వరుస, నీటి రితి ఎరుగని యువకుల సమాజం మనది! తందాన తాన !
అరెరే! చట్టం లొసుగులు కానని న్యాయం, నల్ల కోటు వాటపు సమాజం మనది ! తందాన తాన !
అరెరే! న్యాయ పాలన అంటారే, కాల యాపన, సాగదీతల సమాజం మనది! తందాన తాన !
వంతలు 1, 2 : అరెరే! వందల వేల వనితల గాధలు, బాధలు చూడు! తందాన తాన !
అరెరే! మన మీడియా ప్రభావం యువతపై తారాడు ! నేడు భళా భళి!
ప్ర. కథ : వినరా సోదరా! విజయం మనదేరా! తందాన తాన !
అరెరే! వినరా సోదరా! విజయం మనదేరా! తధక్క తోం ! తందాన తాన !
అరెరే! మన తెలుగు వారి బీరాలు చూడరా! తందాన తాన!
వంతలు 1, 2 : భళా భళి ! వినరా సోదరా! విజయం మనదేరా! తందాన తాన !
పిట్ట కథ – 2
వం. 1 : వినరా వినరా సోదరా! ఓరన్నా చిన్నన్నా! వింతలూ, వినూత్న జోకులు వినండి భళా భళి !
వం. 2 : ఎట్టెట్టా! భళా భళీ! తరిగిట తరిగిట తోం! జోకులే! చెప్పరా బామ్మర్ది ! తందాన తాన!
వం. 1 : వినండి, సోదరి సోదరు లారా! భళా భళి! రాజా వారి కొలువు కూటం రా ! బావ !
(భార్య విధేయులు, వీరులు కాని వారు మీలో ఎవరో చేతులు ఎత్తండి- అంటూ) తందాన తాన !
రాజా వారు రామ బాణాన్ని విసిరారు సభలోకి, భళా భళి! తందాన తాన !
వం. 2 : అరెరే! సభలోని వారంతా చేతులు ఎత్తారు తందాన తాన! ఒక్కరు తప్ప! భళా భళి!
వం. 1, 2 : అరెరే! వినరా సోదరా! విజయం మనదేరా! తందాన తాన ! తధక్క తోం ! అరెరే అసలు సిసలు భార్యా విధేయుడు అంటూ హేళనగా జయ జయ ధ్వానాలు పలకండి అంటూ ప్రకటనా జారీ అయ్యింది! తందాన తాన !
వం. 1 : అరెరే! చేయి ఎత్తని వీరుడు భళా భళి! నోరు తెరిచి ఇలా వేడు కున్నాడు ! తందాన తాన ! రాజా మన్నించండి చేయి ఎత్తాలన్నా, దించాలన్నా నా భార్య అనుమతి లేనిదే నేనేమి చేయలేను అంటూ సభలో మోకరిల్లాడు ! తందాన తాన !
వం. 1, 2 : అరెరే! సభలో నవ్వులు, పువ్వులు విరిశాయి తందాన తాన!
ప్ర. కథ : వినరా ఆంధ్ర కుమారా! విజయం మనదేరా! తందాన తాన! మన వనితల గాధలు, బాధలు నేడు తందాన తాన !
అయ్యయ్యో ! వినరా సోదరా! ఆడబిడ్డలపైన అంతం లేని ”లైంగిక దాడులు” తందాన తాన !
అరెరే! ఆపలేని ఓపలేని హాహా కారాల తల్లిదండ్రుల సమాజం మనది! తందాన తాన !
అరెరే! మానం మర్యాద తిరిగి రావంటు బలవన్మరణ సమాజం మనది! తందాన తాన !
అరెరే! పరువు, ప్రతిష్ట మంట గలిసిన వంటూ గగ్గోలు సమాజం మనది! తందాన తాన !
అరెరే! ఊతం, ఊపు, చూపు కానరాని ఒట్టి ఊకదంపుడు సంమాజం మనది! తందాన తాన !
వం. 1, 2 : రామ రామ శ్రీరామ రామా! ఓ రామ రాఘవా, శ్రీ రామ రాఘవా ! ఇంత దారుణమా మన సమాజంలో!
రామ రామ శ్రీరామ రామా! ఓ రామ రాఘవా, శ్రీరామ రాఘవా!
పిట్ట కథ – 3
వం. 1, 2 : అరెరే! వినరా సోదరా! విజయం మనదేరా! తధక్క తోం! తరిగిట తరిగిట తోం!
అరెరే! రాజ్యమేలే రాజు, మంత్రి రాత్రి వేళ మారు వేషాలలో సంచారం రా! తమ్ముడూ తందాన తాన!
వం. 1 : అరెరే! ఆ సంచారం ప్రజా క్షేమం కోసం కాదురా ! తమ్ముడూ తందాన తాన!
వం. 2 : తధక్క తోం! మరి అంత రాత్రి వేళ అంత ప్రమాద కరంగా ఈ సంచారం ఎందుకురా తమ్ముడూ! తందాన తాన !
వం. 1 : అరెరే! నాట్య గత్తెల వగలు, వలపు కోసం రా ! తమ్ముడూ! తందాన తాన !
వం. 2 : కానీ ఈ దుర్మార్గులు పన్నగాలెన్నో ప్రజల కెరుకే రా! తమ్ముడూ! తందాన తాన !
వం. 1 : ఓహో! అంత రసికులా! ఎంత దుర్మార్గం రా ! తమ్ముడూ ! తందాన తాన !
వం. 2 : అందుకే రా! తమ్మడు ! దుక్కల్లాంటి కుర్ర కారు వ్యూహాత్మకం గా సుందరీమణుల వేషాలు గట్టారు రా! తమ్ముడూ తందాన తాన!
వం. 1 : తధక్క తోం! భళా భళి! తిరగబడిన సుందరీమణులు ఆ ఇరువురికీ దేహ శుద్ధి చేశారు రా! తమ్ముడూ! తందాన తాన !
వం. 2 : తధక్క తోం! తరిగిట తరిగిట తోం! అద్గది రా తమ్ముడూ! కుక్క కాటుకి చెప్పు దెబ్బ రా! తందాన తాన !
వం. 1, 2 : అరెరే! వినరా సోదరా! విజయం మనదేరా! తందాన తాన!
అరెరే! వనితల గాధలు, బాధలు నేడు తందాన తాన !
ప్ర. కథ : అరెరే! ఢిల్లీ గల్లిలో తేడా లేదు నేడు! రేపుల చావుల రౌతుల సమాజం మనది! తందాన తాన !
అరెరే! నిన్న, నేడు గడువే లేదు, కోర్టుల చుట్టూ తిరిగే సమాజం మనది! తందాన తాన !
అరెరే! కాకుంటే పంచాయితీలు, జుల్మానాలు వేసే పెద్దల గద్దల సమాజం మనది! తందాన తాన !
అరెరే! అందుకే కేసులు లేవు, కోర్టులు లేవు ప్రజా కోర్టుల సమాజం మనది! తందాన తాన !
వం. 1, 2 : అయ్యో ! అయ్యయ్యో! భళా భళి, ఏమిటిరా! ఈ పాపం నేడు ! తందాన తాన !
అయ్యయో! అరెరే! ఎంతగా నీతి నియమాలకు పాతరేసారో నేటి మన యువత ! తందాన తాన !
వం. 1 : భళా నంటి భారు తమ్ముడా ! మేలు భళా నోరు దాదాన! అరెరే అంతం లేదా తమ్ముడూ!
భళా భళి ”అత్యాచారాలు” ఆగవా? తమ్ముడూ ! తందాన తాన !
వం. 2 : అరెరే! భళా నంటి భారు తమ్ముడా ! మేలు భళా నోరు దాదాన! అసాధ్య మేది లేదురా! తందాన తాన !
తరిగిట తరిగిట తోం! తందాన తాన !
(వచన ప్రసంగంలో)
ప్ర. కథ : 2012 డిసెంబరు 16 న అరెరే! న్యూ ఢిల్లీ – మునర్క బస్సులో ప్రయాణిస్తున్న 23 ఏళ్ల మహిళపై నలుగురు కుర్రకారు
A : సాముహిక లైంగికదాడి చేసి అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు రా! తమ్ముడూ ! అంత, ”దిశ” చట్టం ద్వారా 11 ఏండ్లు మలుపులు తిరిగి తిరిగి శిక్షలు అమలు చేశారు. దోషులను ఉరి తీసారు రా! తందాన తాన !
దీ : అరెరే! బీహార్‌ నుండి కేరళలోని ”అలువ” కు వలస వచ్చిన కుటుంబములోని మైనర్‌ బాలిక, 5 ఏండ్లు చాందిని పాపను లైంగికదాడి చేసి మర్డరు చేసిన కేసులో ”ఫోక్సో” చట్టం ద్వారా శిక్ష విధించారు ! తందాన తాన !
జ : అరెరే! 24 పరగణాల జిల్లా – పశ్చిమ బెంగాల్‌లో ”లైంగికదాడి” చేసి మహిళను హత్య చేయగా, మహిళతో ప్రయాణించిన ఆమె కుమార్తె సాక్ష్యంతోనూ, జాదవ్‌పూర్‌ యునివర్సిటి ప్రొఫెసర్‌ రిపోర్టుతో కోర్టు విచారణ అనంతరం 8 జూన్‌ 2024 న శిక్ష విధించారు. తందాన తాన !
ణ : అరెరే! భళా భళి ! 60 ఏండ్ల ముదుసలిని చండీఘర్‌లోని అటో డ్రైవరు మరికొందరు సాముహిక లైంగికదాడి, హత్య చేయగా కోర్టు విచారణతో జూలై 2023లో శిక్షలు అమలు జరిగాయి! తందాన తాన !
జు : అరెరే! హైదరాబాద్‌లోని ఓ టోల్‌ ప్లాజా వద్ద 2019 డిసెంబరు 6 న సాముహిక లైంగికదాడి, హత్య చేసిన వారిని పోలీసులే నేరుగా కాల్చి చంపి శిక్ష విధించారు! తందాన తాన !
భళా నంటి భారు తమ్ముడా ! మేలు భళా నోరు దాదాన! సోదర సోదరీ మణులారా, నేషనల్‌ క్రైమ్‌ రికార్డు గణాంకాల ప్రకారం మన దేశంలో 2018 లో 39,977 లైంగిక దాడులు కేసులు రికార్డు అయినట్టు ప్రకటించింది. తందాన తాన !
వం. 1, 2 : తధక్క తోం! తరిగిట తరిగిట తోం! తందాన తాన ! ఈ దారుణ మారణ లైంగికదాడి ఆగే మార్గం లేదా సోదరా ! తందాన తాన!
ప్ర. కథ : లేకేమి రా! సోదరా! తధక్క తోం! తందాన తాన ! సమాజంలోనే మహిళల పట్ల సమగ్ర మార్పు రావాలి- తధక్క తోం! తందాన తాన !
వం. 1, 2 : అలాగా తమ్ముడూ! తందాన తాన ! వినరా సోదరా! వనితల గాథలు బాధలు నేడు ! తరిగిట తరిగిట! తందాన తాన!
ప్ర. కథ : అరెరే! తధక్క తోం! తందాన తాన ! నేటి ఈ సమాజంలో తందాన తాన! ఏలే వారు జాగతమై చట్టాలు అమలు చేయాలి! తందాన తాన! వనితల గాథలు బాధలు నేడు! తందాన తాన! నేటి ఈ సమాజం లో తందాన తాన! కోర్టుల జాప్యం వలదు ! భళా నంటి భారు తమ్ముడా ! మేలు భళా నోరు దాదాన! అరెరే! తధక్క తోం! తందాన తాన!
నేటి ఈ సమాజంలో తందాన తాన! యువశక్తికి, స్త్రీ శక్తికి నైతికత పెరగాలి తందాన తాన! తరిగిట తరిగిట తోం! తందాన తాన!
వం. 1, 2 : అరెరే! భళా భళి! ఏమిటింత దారుణం? దీనికెవ్వరు కారణం? భళా భళి!
(కథకులు అందరూ)
ఔను నిజం, ఔనౌను నిజం! తందాన తాన!
యువ శక్తి కి, స్త్రీ శక్తికి పదును పెట్టాలి తందాన తాన!
యువతీ యువకులు ముందడుగులు వేయాలి! తందాన తాన!
అరెరే! ఆపాలి, ఆపాలి ”లైంగిక దాడులు” ఆపాలి! తరిగిట తరిగిట తోం! తందాన తాన!
అరెరే! వనితల బాధలు, గాథలు మారాలి! మారాలి! తందాన తాన!
సందేశం :- 1. పురుష సమాజం మొత్తం మహిళలను సమదష్టి తో చూడాలి.
నినాదం :- 2. పురుషాధిక్య సమాజాన్ని నిరసిద్దాం – స్త్రీ శక్తిని గౌరవిద్దాం.
మంగళం జయ మంగళం! జాగ్రుత సమాజానికి జయ జయ మంగళం!