మొన్న సిద్ధిఖీ… నిన్న ఒబామా

– అమెరికాలో వినిపిస్తున్న నిరసన గళాలు
– వాస్తవాలు గ్రహిస్తున్న ప్రజానీకం
వాషింగ్టన్‌ : ప్రపంచంలోని రెండు అతి పెద్ద ప్రజాస్వామిక దేశాల మధ్య ఉన్న సామీప్యతను గురించి ప్రధాని నరేంద్ర మోడీ తన అమెరికా పర్యటన సందర్భంగా ప్రతినిధి సభలో ప్రస్తావించారు. ఆయన ప్రసంగం విని అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు కరతాళ ధ్వనులు చేశారు. మోడీని గొప్ప రాజనీతిజ్ఞుడంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఆ దేశ ప్రజలకు ఇప్పుడిప్పుడే మోడీ అంటే ఏమిటో తెలిసొస్తోంది. మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే మాజీ అధ్యక్షుడు బరక్‌ ఒబామా సీఎన్‌ఎన్‌కు చెందిన క్రిస్టియన్‌ అమన్‌పూర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘అధ్యక్షుడు జో బైడెన్‌ భారత ప్రధాని మోడీతో సమావేశమైనప్పుడు అక్కడి ముస్లిం మైనారిటీల రక్షణకు ఆయన తీసుకుంటున్న చర్యలేమిటో అడిగి ఉండాల్సింది’ అని అన్నారు. బరక్‌ వ్యాఖ్యలు అమెరికాలో కలకలం రేపాయి. మరో సంఘటనను గురించి కూడా ప్రస్తావించాలి. తొమ్మిది సంవత్సరాల పాటు పాత్రికేయులకు ముఖం చాటేసిన మోడీకి అమెరికాలో విలేకరుల సమావేశాన్ని ఎదుర్కోక తప్పలేదు. అయితే ఆయనకు జర్నలిస్ట్‌ సబ్రినా సిద్ధిఖీ నుండి ఊహించని ప్రశ్న ఎదురైంది. ముస్లింలపై వివక్ష ప్రదర్శిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భారత్‌ను ప్రజాస్వామిక దేశమని ఎలా అంటామని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నను భారతీయ పాత్రికేయులెవ్వరూ మోడీని అడగలేదు. వాస్తవానికి వారికి ఆ అవకాశం కూడా రాలేదు. సిద్ధిఖీ అడిగిన ప్రశ్నకు మోడీ బదులిస్తూ తమ దేశంలో వివక్ష అనే పదానికి తావే లేదని చెప్పారు. ఒబామా వ్యాఖ్యలు, సిద్ధికీ ప్రశ్నతో బీజేపీ నేతలు గంగవెర్రులెత్తి పోయారు. సిద్ధిఖీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది. అమెరికా అధ్యక్ష భవనం కూడా ఈ ట్రోలింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఇక ఒబామా వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు.
ఒబామా మన దేశంలో పర్యటించినప్పుడు మోడీ ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఒబామాను తన స్నేహితుడంటూ కొనియాడారు. ఇప్పుడేమో మోడీ కేబినెట్‌లోని మంత్రులు ఆయనపై విమర్శలు సంధిస్తున్నారు. ఒబామా పేరు మధ్యలో ఉన్న ముస్లిం పదాలను ప్రస్తావించడం మాత్రం మరచిపోవడం లేదు. విదేశీ పర్యటన నుండి స్వదేశానికి చేరుకున్న మోడీ తన ముసుగును తొలగించారు. ఈ సంవత్సరం చివరలో ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అంశాన్ని లేవనెత్తారు. కర్నాటకను కోల్పోయిన బీజేపీ, మరో రాష్ట్రాన్ని చేజార్చుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకే మతపరమైన ఏకీకరణ ద్వారా లబ్ది పొందాలని ప్రయత్నిస్తోంది. అణచివేతలు, హింస, మైనారిటీలపై దాడులు, మీడియా స్వేచ్ఛపై దాడి వంటి అంశాలపై ప్రశ్నలకు మోడీ అమెరికాలో సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన పర్యటనకు ముందు పలువురు మీడియా వ్యాఖ్యాతలు చెప్పుకొచ్చారు. ఇదంతా బైడెన్‌ ప్రభుత్వానికి తెలియనిదేమీ కాదు. అయితే దాని కారణాలు దానికి ఉన్నాయి. అందుకే మోడీకి ఎర్ర తివాచీ స్వాగతం పలికింది. సిద్ధిఖీపై ట్రోలింగ్‌ను తప్పుపట్టిన బైడెన్‌ ప్రభుత్వం, తమ మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై మాత్రం నోరు మెదపలేదు.