– భగత్‌సింగ్ భావజాలాన్ని యువత పాటిస్తూనే సమాజంలోకి తీసుకెళ్లాలి
– ఎస్‌ఎఫ్‌ఐ-డీివైఎఫ్‌ఐ యువజన ఉత్సవాల ముగింపు సభలో పలువురు వక్తలు
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
భగత్‌సింగ్ వర్ధంతి సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మార్చి 1 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన భగత్‌సింగ్ స్మారక యువజన ఉత్సవాలు ఆదివారం ముగిశాయి.ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిర్‌లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమైఖ్య (డీవైఎఫ్‌ఐ) హైదరాబాద్ జిల్లా కార్యదర్శులు అశోక్ రెడ్డి, ఎండీ జావిద్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రముఖ సినీ నటులు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భగత్‌సింగ్ ఆశయాలు చాలా గొప్పవని, ఆయన ఆలోచనలు విద్యార్థులు అనుసరిస్తూనే సమాజంలోకి పోవడానికి కృషి చేయాలన్నారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వర్ధంతిని విద్యార్థుల్లోకి తీసుకెళ్లుతున్న ఎస్‌ఎఫ్‌ఐ-డీవైఎఫ్‌ఐను అభినందించారు. శివారెడ్డి మాట్లాడుతూ.. సమాజాన్ని పక్కదోవ పట్టించే అంశాలపై నేటి యువత కేంద్రీకరిస్తూ కుటుంబం, దేశం గురించి ఆలోచించడం లేదన్నారు. డ్రగ్స్, గంజాయి లాంటి వాటికి దూరంగా ఉంటూ దేశం కోసం యువత ఆలోచించాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. యువకులు భగత్ సింగ్‌ను ఆదర్శంగా తీసుకొని సమస్యలపై పోరాడాలని సూచించారు. భగత్‌సింగ్ పేరుతో యువజనోత ్సవాలు నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ-డీివైఎఫ్‌ఐ పాత్ర ఆద్వితీయం అని కొనియాడారు. ప్రతేడాది ఇలానే యువజన ఉత్సవాలు నిర్వహించి విద్యార్ధులు, యువతలో చైతన్య నింపాలని కోరారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నాగరాజు, వెంకటేష్ మాట్లాడుతూ.. భగత్ సింగ్, రాజుగురు, సుఖ్‌దేవ్ 93వ వర్ధంతి సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆలోచనలను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నామన్నారు. నేటి సమాజంలో భగత్‌సింగ్ ఆలోచన విధానం చాలా అవసరమని తెలిపారు. భగత్ సింగ్ తన చిన్నతనం నుండే జాతీయోద్యమం లో పాల్గొని, సమాజంలోని అసమానతలు, మత విద్వేషాలు, వివక్షతలకు వ్యతిరేకంగా ఉద్యమించార ని గుర్తుచేశారు. అలాంటి అమరవీరుల అశయాలకు అనుగుణంగా నేడు యువత కూడా పోరాడాలని తెలిపారు.ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పవిత్ర, జిల్లా ఉపాధ్యక్షులు స్టాలిన్, వీరేందర్, కవిత, నాయకులు అభిమన్యు, విగేష్, చరణ్ శ్రీ, అజరు, శివ గణేష్, దాసు, సాయి, విద్యార్ధులు పాల్గొన్నారు.