– మంత్రి ఉత్తమ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
– మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై వెల్‌లోకి దూసుకెళ్లిన బీఆర్‌ఎస్ సభ్యులు
– ఉద్రిక్తతల నడుమ నేటికి సభ వాయిదా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల రంగం-శ్వేతపత్రం అనే అంశంపై శనివారం అసెంబ్లీలో లఘుచర్చ చేపట్టనున్నారు. సాగునీటి రంగంపై మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. వాస్తవానికి శుక్రవారం సాయంత్రమే సభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అసెంబ్లీ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 5:51 నిమిషాలకు సభ ప్రారంభమైంది. వెంటనే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య లేచి మాట్లాడారు. సభలో సాగునీటిరంగంపై సుధీర్ఘ చర్చ జరగాల్సిన అసవరమున్న నేపథ్యంలో శనివారానికి వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు. దీన్ని బీఆర్‌ఎస్ సభ్యులు తప్పుబట్టారు. ఈ సమయంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేచి ‘పాపాల భైరవుడు..సభకు వచ్చి చర్చలో పాల్గొనాలి’ అంటూ కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్‌ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లారు. కోమటిరెడ్డి మాటలను రికార్డుల నుంచి తొలగించాలని పట్టుబట్టారు. ‘శ్రీధర్‌బాబు ఇది పద్ధతేనా? సభను నడిపే తీరు ఇదేనా. ఇది చెప్పడానికి రెండు గంటలు కూర్చోబెట్టాలా?’ అంటూ కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌రావు స్పీకర్‌నుద్దేశించి మాట్లాడుతూ..’సభను నడిపే పద్ధతి ఇది కాదు. మంత్రి ఇలా మాట్లాడటం సరిగాదు. మేం కూడా ఇష్టమున్నట్టు అనొచ్చు. స్పీకర్‌గారూ ఇలా మాట్లాడొచ్చా? మంత్రి చేసిన వ్యాఖ్యలను రిక్డారుల నుంచి తొలగిస్తేనే మేం మాట్లాడుతాం’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేచి ‘హెలిక్యాప్టర్‌లో ప్రయాణం చేసి నల్లగొండ సభకు పోవచ్చుగానీ, పెద్దమనిషి ఇక్కడ ఉండి సభకు రాలేరా? నల్లగొండకు అన్యాయం చేసిండు. అందుకే కేసీఆర్‌ను రమ్మన్ని పట్టుబడుతున్నం.. మమ్ముల్ని దున్నపోతు లంటాడా? నన్ను అరెరు..తురెరు అంటడా? సీఎంను పట్టుకుని ఇష్టమొచ్చిన మాటలు అనొచ్చా? కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. అదే సమయంలో హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ ‘సభలో అలా మాట్లాడొద్దు. బయట అన్న వాటిని సభలో ప్రస్తావించొద్దు. గతంలో రేవంత్‌రెడ్డి..కేసీఆర్‌ను కాల్చిపడేయాలి, ఉరితీయాలి అన్నడు’ అని గుర్తుచేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో మంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ కార్యకలాపాల షెడ్యూల్‌లో తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగం-శ్వేతపత్రం’పై చర్చ అని పేర్కొని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జీరో అవర్ పెట్టి, ఆ తర్వాత కులగణనపై తీర్మానం చేసి సభకు టీ బ్రేక్ ఇచ్చారు. రెండు గంటలు వెయిట్ చేయించి ఇప్పుడు వాయిదా అంటారా? ఇదేం పద్ధతి’ అని అడిగగారు. బీఏసీలో చర్చించి ఫైనల్ చేయకుండా కొత్త అంశాలను పెట్టకూడదని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. రాత్రి 11 అయినా సభలో చర్చిండానికి తాము సిద్ధమనీ, పూర్తిగా సన్నద్ధమై వచ్చామని తెలిపారు. విప్‌లు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి సహకరించాలని కోరారు. బీజేపీ పక్షనేత ఎ.మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..కొన్ని గంటల పాటు వెయిట్ చేయించి ఇప్పుడు వాయిదా వేస్తున్నామని చెప్పటం సరిగాదన్నారు. శనివారం నాడు ఢిల్లీలో తమ పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ఉందనీ, ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోయారని చెప్పారు. జీరో అవర్ ఉండాల్సిందేననీ, సభను ఇంకొన్ని రోజుల పాటు పొడిగించినా తమకేం అభ్యంతరం లేదని చెప్పారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం సభ్యులు జాఫర్ హుస్సేన్ మాట్లాడుతూ..సభను శనివారానికి వాయిదా వేయాలని కోరారు. సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ..సమ్మక్కసారలమ్మ జాతరను పరిగణనలోకి తీసుకుని సభను 25 తర్వాత పెట్టినా తమకు ఓకేననీ, ఒకవేళ రేపే నిర్వహిస్తామన్నా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. సభను మాత్రం ఈ రోజు వాయిదా వేయాలని కోరారు.
బీఏసీ రోజూ పెట్టరని తెలియదా? : దుద్దిళ్ల
ప్రతిరోజూ బీఏసీ పెట్టరనే విషయం హరీశ్‌రావుకు తెలియదా? అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ఇంకేమైనా మిగతా కార్యకలాపాలుంటే స్పీకర్ అనుమతితో ముందుకెళ్తామని బీఏసీలోనే చెప్పామని గుర్తుచేశారు. శ్వేతపత్రంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే, సీపీఐ, ఎంఐఎం, తమ సభ్యులు సభను వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారని చెప్పారు. ఎక్కువ మంది సభ్యులు చర్చలో పాల్గొనాల్సి ఉంది కాబట్టి శనివారం నిర్వహించాలనే డిమాండ్ సభ్యుల నుంచి వచ్చిందన్నారు. మంత్రి మాట్లాడిన అనంతరం సభను శనివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.