ఏకతాటిపైకి..

– అసంతృప్తుల బుజ్జగింపులో కేఎల్‌ఆర్‌ సక్సెస్‌
– మహేశ్వరంలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రయాణం
– బీఆర్‌ఎస్‌, బీజేపీల్లోని అసంతృప్తులతో కేఎల్‌ఆర్‌ మంతనాలు
– హస్తం శ్రేణుల్లో పెరిగిన జోష్‌
కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల తరువాత అసంతృప్తులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మహేశ్వరం నియోజకవర్గం కూడా ఈ కోవలోనిదే. ఇక్కడ పార్టీ కిచ్చన్నాగారి లక్ష్మారెడ్డి (కేఎల్‌ఆర్‌)కు టికెట్‌ కేటాయించడంతో టికెట్‌ ఆశించి భంగపడ్డ వారు తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే వీరందరినీ బుజ్జగించడంలో కేఎల్‌ఆర్‌ సక్సెస్‌ అయ్యారు. అసంతృప్తులతో మాట్లాడి వారందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. అందరం కలిసి పార్టీ కోసం పనిచేయాలని, పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని వారిలో ఒకడినై పనిచేస్తానని అసంతృప్తులకు భరోసానిచ్చారు. అందరూ ఏకతాటిపైకి రావడంతో స్థానిక క్యాడర్‌లో జోష్‌ పెరిగింది.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం నియో జకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. 2014 స్వల్ప ఓట్లతో ఓడిపోయిన కాంగ్రెస్‌, 2018లో బీఆర్‌ఎ స్‌పై విజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందిన మంత్రి సబితాఇంద్రారెడ్డి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం లేకుండా పోయింది. స్థానిక నాయకత్వం ఉన్నప్పటికీ అధికార పార్టీకి పోటీగా నిలబడి.. తలబడే శక్తియుక్తులు ఉ న్న నాయకత్వం లేకపోయింది. దాంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొంత అభద్రత భావం ఉండేది. మహే శ్వరంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి ఢకొీట్టే స్థాయి కాంగ్రెస్‌కు లేదన్న భావనలో ఉన్నారు. దానిని తిప్పికొట్టేందుకు అధిష్టానం పక్కప్లాన్‌తో మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ను రంగంలోకి దింపింది. మహేశ్వరంతో ఏలాంటి సంబంధాలు లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కున్న ఇమేజ్‌ పనిచేస్తాదన్న భావనలో అధిష్టానం కేఎల్‌ఆర్‌ను బరిలో నిలిపింది. అయితే ఆయనకు టికెట్‌ ఇవ్వడాన్ని స్థానిక నేతలు వ్యతిరేకించారు. బహిరంగంగానే పార్టీపై విమర్శలు చేశారు. దీన్ని గమనించిన కేఎల్‌ఆర్‌ ‘ నేను కేవలం అభ్యర్థిని కాకపోయినా.. ఆధిష్టానం పంపిస్తే వచ్చిన నాయ కుడిని తప్ప మీ మీద పెత్తనం చేలాయించే వ్యక్తిని కాదు.. ఇక్కడ మీరే బాస్‌.. మీ నిర్ణయ మేరకు పనిచేస్తా.. అందరం ఐక్యగా పోరాడాలి కాంగ్రెస్‌ను గెలుపించుకోవాలి’ అని కేఎల్‌ఆర్‌ అసంతృప్తులను బుజ్జగించారు. అసంతృప్తులను మచ్చిక చేసుకునే విషయంలో కేఎల్‌ఆర్‌ విజయం సాధించారు. కేవలం పారిజాతనర్సింహ్మరెడ్డి వర్గం తప్పా మిగా వారంతా ఏకతాటిపైకి వచ్చినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌
అసంతృప్తులు ఏకతాటిపైకి రావడంతో కాంగ్రెస్‌ క్యాడర్‌లో జోష్‌ పెరిగింది. మహేశ్వరంలో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎల్‌ఆర్‌ రాజకీయ వ్యూహం కాంగ్రెస్‌ శ్రేణులను ఉత్సహ పరుస్తోంది. టికెట్‌ ఆశించి భంగపాటుకు గురైన నాయకులకు భరోసా కల్పించి పార్టీ కోసం పనిచేయాలని వారిలో ధైర్యం నింపడంలో కేఎల్‌ఆర్‌ విజయం సాధించారు. ఆ విజయ ఫలితాలు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను ఇవ్వనున్నాయని ఆ పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్‌, బీజేపీ అసంతృప్తులతోనూ మంతనాలు
బీఆర్‌ఎస్‌, బీజేపీ అసంతృప్తి నాయకులతో కేఎల్‌ఆర్‌ ప్రత్యేకంగా భేటి అయ్యారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇటీవల దేవేందర్‌గౌడ్‌ ఇంటికి వెళ్లిన కేఎల్‌ఆర్‌ తమకు మద్దతు కోరారు. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కేఎల్‌ఆర్‌ అంతర్గత చర్చలు జరుపుతున్నారు. మంత్రిపై అసంతృప్తిగా ఉన్న నాయకులను మచ్చిక చేసుకోవడం కోసం కేఎల్‌ఆర్‌ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.