– జూన్‌లో 4.81 శాతానికి సీపీఐ
న్యూఢిల్లీ : దేశంలో ద్రవ్యోల్బణానికి హెచ్చు టమాట, ఇతర కూరగాయల ధరలు ఆజ్యం పోశాయి. ప్రస్తుత ఏడాది జూన్‌లో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ) 4.81 శాతానికి ఎగిసిందని కేంద్ర గణంకాల శాఖ బుధవారం వెల్లడించింది. ఇంతక్రితం మేలో 4.31 శాతంగా నమోదయ్యింది. ఇదే నెలలో అహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 2.96 శాతంగా ఉండగా.. గడిచిన నెలలో ఏకంగా 4.49 శాతానికి పెరిగింది. గడిచిన నెలలో గ్రామీణ ద్రవ్యోల్బణం 4.72 శాతంగా, పట్టణ ద్రవ్యోల్బణం 4.96 శాతంగా నమోదయ్యింది. మే నెలలో కూరగాయల ధరలు మైనస్ 8.1 శాతంగా ఉండగా.. జూన్‌లో ఏకంగా 0.93 శాతానికి పెరిగాయి. అహారోత్పత్తులు – పానియాలు, ఇంధన ద్రవ్యోల్బణం వరుసగా 4.63 శాతం, 3.92 శాతంగా నమోదయ్యింది. తృణధాన్యాల ద్రవ్యోల్బణం 12.65 శాతం నుంచి 12.71 శాతానికి చేరింది. ప్రధానంగా కూరగాయాల ధరల వల్లే వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ పెరిగిం దని ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నయర్ పేర్కొ న్నారు. రాబోయే మధ్యస్థ కాలానికి కూరగాయలు, అహారోత్పత్తుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించాల న్నారు. గత కొన్ని వారాలుగా దేశంలో టమాట, పచ్చి మిర్చి ధరలు రూ.100 నుంచి రూ.200 మధ్య పలుకుతున్నాయి. తగ్గిన ఆదాయాలతో పెరిగిన ధరలతో కొనలేని పరిస్థితితో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వరుసగా ధరలు పెరిగితే ఆర్‌బీఐ మళ్లీ వడ్డీ రేట్లు పెంచే ప్రమాదం ఉంది.