టమాటాఏ100

న్యూఢిల్లీ : దేశంలో టమాటా ధరలు వేగంగా పెరుగుతున్నాయి. కిలో టమాటా ధర త్వరలో రూ.100 మార్కు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. నైరుతి రాక ఆలస్యం, పలుచోట్ల వర్షాలు తక్కువగా పడుతుండటంతో క్రమంగా టమాటాలు, పప్పు దినుసుల ధరలు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈమారు టమాట సాగు తక్కువగా ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది చిక్కుడుకు మంచి ధర పలకడంతో అనేకమంది రైతులు ఈ పంటసాగువైపు మళ్లారు. దీనికి తోడు వర్షపాతం తక్కువగా ఉండటంతో అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోయాయి. ఉల్లి, బంగాళదుంప మినహా ఇతర కూరగాయల ధరలు పెరిగాయని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే కూరగాయల ధరలు సామాన్యులను ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. భోపాల్‌లో గతవారంతో పోలిస్తే కిలో టమాటా 10 రూపాయల మేర పెరిగి రూ.100కు చేరుకుంది.