నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రముఖ మేధావి ప్రబీర్ పురకాయస్తా గ్రంథస్తం చేసిన ”కీపింగ్ ఆప్ ది గుడ్ ఫైట్” పుస్తకావిష్కరణ సభ మంగళవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరగనుంది. గ్రంథ రచయిత జేఎన్‌యు విద్యార్థి, ప్రజాస్వామ్యవాది, 1975లో ప్రకటిత ఎమర్జెన్సీని వ్యతిరేకించి సంవత్సర కాలం జైలులో ఉంటూనే, అనంతర కాలంలో రాజ్యాంగ బద్ధమైన హక్కుల కోసం పోరాడిన అనుభవాలను ఇందులో పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్ర రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక, పట్నం, ఐలూ ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని పట్నం ప్రధాన కార్యదర్శి డీజీ నర్సింహారావు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పార్థసారధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పుస్తకాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.జాతీయ సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, ప్రొఫెసర్ జి. హరగోపాల్, ప్రొఫెసర్, డాక్టర్ కె.నాగేశ్వర్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, స్వతంత్ర జర్నలిస్ట్ తులసి చందు సభలో ఉపన్యసిస్తారు. కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు సీనియర్ అడ్వకేట్ జి.విద్యాసాగర్ అధ్యక్షత వహిస్తారు. ప్రజాస్వామ్యవాదులు, విద్యావంతులు, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, యువతీ, యువకులు, విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.