రేపు భూ సదస్సు

– రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసం భూ(ధరణి) సదస్సు నిర్వహిస్తున్నామని తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వెల్లడించాయి. ఈమేరకు ఆదివారం ఆయా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి. సాగర్‌, ఆర్‌ వెంకట్రాములు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ధరణి లోపాలను సరిచేయడానికి మార్చి 1 నుంచి 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం నిర్ణయించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి పూనుకున్నదని తెలిపారు. సమగ్ర భూసర్వే జరగకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇంకా అనేక భూ సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తు చేశారు. వీటిపై సమగ్రంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకు రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. కౌలు రైతులు, అసైన్మెంట్‌ భూములు సాగు చేసుకుంటున్న రైతులు, అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు రానివారు ఇలా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వివరించారు. సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు సదస్సులో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.