మీలో ఎంతమంది శర్వానంద్ నటించిన మహానుభావుడు సినిమా చూసారు? ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు హాస్యంగా కనిపించినా, హీరోకు ఉన్న OCDఅనే మానసిక జబ్బు అతని జీవితంలో ఎన్ని సమస్యలు తీసుకువచ్చిందో ఆ సినిమాలో చూశాం. ఇప్పుడు ఆ అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (OCD) అనే మానసిక జబ్బు గురించి తెలుసుకుందాం.
ఒక వ్యక్తి శుభ్రత గురించి విపరీతమైన ఆందోళన కలిగి ఉండటంతో పాటు ఒత్తిడికి గురవడం, శుభ్రత పట్ల అతి జాగ్రత్తగా ఉండటం, తన వస్తువులను కచ్చితమైన క్రమ పద్ధతిలో ఉంచుకోవడం, వాటిని పదేపదే సరిచూసుకోవడం అంటే సాధారణం కంటే అతిగా ఉండే ప్రవర్తనను అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ అనే మానసిక వ్యాధిగా పరిగణిస్తారు.
మహిళల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. పాత్రలు సరిగ్గా శుభ్రం చేయకపోతే ఆ పాత్రల్లోని సూక్ష్మజీవులు, బాక్టీరియా ద్వారా వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారని విపరీతంగా ఆందోళన చెందుతూ, తమని నిందించుకుంటూ ఉంటారు. చిన్న పిల్లలకి మాటిమాటికీ స్నానం చేయించడం, వారి దుస్తులను అతిగా ఉతకడం లాంటివి చేస్తుంటారు.
OCDలో మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి.
ఆవేశాలు : మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే ఆలోచనలు
భావోద్వేగాలు : మీరు అనుభూతి చెందే ఆందోళన
బలవంతాలు : మీ ఆందోళనను తగ్గించడానికి మీరు చేసే పనులు
మీకు తెలుసా?
జీవశాస్త్రవేత్త చార్లెస్ డార్విన్, ఫ్లోరెన్స్ నైటింగేల్, నటి కామెరాన్ డియాజ్, సాకర్ ప్లేయర్ డేవిడ్ బెక్హామ్ వంటి ప్రముఖులు సైతం ఒసిడీ వ్యాధిచే బాధింపబడి చికిత్స ద్వారా ఉపశమనం పొందినవారే.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1.8 శాతం, భారత జనాభాలో సుమారుగా 0.8 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అందులో ఎక్కువగా 15-44 ఏండ్ల మహిళలే ఉంటున్నారు.
ఇటీవల కొన్ని పరిశోధనలు ఓసిడీతో బాధపడే వ్యక్తి సగటు జీవన ప్రమాణం చాలా తక్కువగా ఉంటుందని తెలుపుతున్నాయి.
OCD వ్యాధి లక్షణాలు :
1. చేతులను విపరీతంగా చాలా సమయం పాటు అనేకసార్లు కడుక్కోవడం.
2. కడిగిన పాత్రలనే మళ్ళీ మళ్ళీ చాలా సమయం పాటు కడగడం.
3. దుస్తులను ఎక్కువగా శుభ్రంగా ఉంచుకోవడం.
4. గదిలో వస్తువులను చాలా శుభ్రంగా, క్రమ పద్ధతిలో ఉంచుకోవడం.
5. పబ్లిక్ టాయిలెట్లు వాడలేకపోవడం.
6. ఇతరులకు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం.
7. చేసిన పనినే అనేకసార్లు చేయడంతో పాటు వాటిని మాటిమాటికీ సరిచూసుకోవడం.
8. సూక్ష్మజీవులు, బాక్టీరియా, వైరస్ వంటి వాటి గురించి వీపరితంగా ఆలోచించి ఆందోళన చెందడం.
9. ఇంట్లో తలుపులు, లైట్స్, స్టవ్, కారు తాళాలు వంటివి పదేపదే చెక్ చేసుకోవడం.
10. ప్రతిదీ క్రమపద్ధతిలో పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోవడం.. మొదలైనవి సాధారణం కంటే అతిగా ఉండి, వారిలో ఆందోళనకు కారణమయ్యే లక్షణాలను ఈ వ్యాధిగా పరిగణించాలి.
మన జీవితంలో ఈ సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రభావితం చూపుతుంది. ఈ విపరీతమైన ఆలోచనలు, ఆందోళనతో కూడిన ప్రవర్తన వల్ల ఆ వ్యక్తి ఎవరితో కలవలేక పోవడం, ఆనందంగా గడిపే వేడుకలకు దూరమవడం, ముఖ్యంగా ఇష్టమైన వ్యక్తికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి రావడం, భార్యాభర్తల జీవితంలో అనేక సమస్యలకు, కలహాలకు దారి తీయడంతో పాటు యాంగ్జైటీ, డిప్రెషన్, ఫోబియా వంటి మానసిక సమస్యలు, శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది.
మీలో కానీ, మీ కుటుంబ సభ్యుల్లో కానీ, మీ మిత్రుల్లో ఎవరైనా ఈ సమస్య బాధపడుతుంటే వారికి భరోసా కల్పించి సైకాలజిస్ట్ ద్వారా సైకో ఎడ్యుకేషన్, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ , ఎక్స్‌పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్ వంటి థెరపీ ద్వారా వారిని ఈ మానసిక సమస్య నుండి బయటకు తీసుకురండి.
– హరిష్ ఆజాద్ (సైకాలజిస్ట్)
7382173741