– రాష్ట్రంలో158 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి
– పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
– వచ్చే నాలుగేండ్లలో ప్రగతిని చూపిస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
– యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించిన మంత్రులు
నవతెలంగాణ-మిర్యాలగూడ/ దామరచర్ల :
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా సంక్షేమంలో తెలంగాణ అగ్రభాగంలో ఉందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని బాదలాపురం గ్రామంలో ఉన్న సూర్యతేజ రైస్ మిల్లులో రూ.4 కోట్లతో అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన సైలోన్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అలాగే, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి యాదాద్రి పవర్ ప్లాంట్‌ను సందర్శించారు. మిల్లు వద్ద మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. సంవత్సర కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. బ్యాంకుల రుణాలతో ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు చెల్లింపులు చేస్తోందని చెప్పారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ఇచ్చే ధాన్యానికి మిల్లుల ద్వారా గ్యారంటీని తీసుకుంటున్నట్టు తెలిపారు. పౌర సరఫరాల శాఖలో రూ.58వేల కోట్ల అప్పు ఉండగా 11 నెలల కాలంలోనే రూ.11వేల కోట్ల అప్పును తగ్గించామన్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా గ్యారంటీ పాలసీని అమలు చేస్తున్నామని, రైస్ మిల్లర్లు అర్థం చేసుకోవాలని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఏపీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల కంటే అత్యధికంగా 47 లక్షల మంది రైతులు 66.07లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారని, 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన ఎంఎస్పీ కంటే అదనంగా సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నామని, ఈ సన్నాలు పండించిన రైతులకు రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు చెల్లించామని తెలిపారు. రాబోయే యాసంగిలో కూడా ఏ సన్నరకం ధాన్యం పండించినా రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారు. వ్యవసాయాధికారుల సూచనల మేరకు తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్‌ఎంటీ రకాలు సాగు చేసుకుంటే మంచిదన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ టన్నల్, డిండి ప్రాజెక్టు, మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఐదు లిప్టు ప్రాజెక్టులు, నల్లగొండలోని బ్రాహ్మణ వెల్లెంల, నక్కలగండి, పిలాయిపల్లి ధర్మారెడ్డి కాల్వ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. మూసీ పునరుజ్జీవానికి నల్లగొండ ప్రజలు అండగా ఉన్నారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైస్‌మిల్లర్లకు, రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుం దన్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చాకే రైతుల కష్టాలు తీరాయని చెప్పారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో డీసీసీ అధ్యక్షులు కెతావత్ శంకర్‌నాయక్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గంప నాగేందర్, ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, కార్యదర్శి రేపాల మధుసూదన్, అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, బండారు కుశలయ్య, జయిని మురళి, పైడిమర్రి రంగనాద్, రాయిని శ్రీనివాస్ పాల్గొన్నారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
దామరచర్ల మండలంలోని వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఒక యూనిట్ ప్రారంభోత్సవానికి శనివారం సీఎం రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం అక్కడి ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు చేసిన అనంతరం వారు మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమనే నినాదంతో ముందుకు పోతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా 800 మెగావాట్ల యూనిట్‌ను మిర్యాలగూడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ప్రారంభించనుండటం సంతోషదాయకమన్నారు.