సాధిక్ అలీ లేడు. అంతను తయారు చేసి నడిపిన బండి వుంది. పుస్తకాలతో బిక్కుబిక్కుమంటూ మౌనంగా, బాధగా, దిగాలుగా, వేదనగా చూస్తూ వున్నది. ఎవరైనా ఇంకో ‘సాధకు’లు నన్ను తోసుకుంటూ మనుషుల దగ్గరికి తీసుకెళతారని. తోపుడు బండిగా నేనెన్ని నాళ్లుగానో బరువులు మోసానేగాని ఇలా సాహిత్యాన్ని, గుండెలయల్ని, జ్ఞాన పత్రసంపుటులను, మేధోమధనంలో వచ్చిన అమృతాక్షరాలను మోసేపనికి నన్ను ఉపయోగించింది మొదటిసారి సాదిక్ భయ్యానే. నన్ను వినియోగించి నా పేరుతోనే పేరు తెచ్చుకున్న మహానుభావుడూ ఆయనే. ఆయనను ‘తోపుడుబండి సాధిక్ అలీ’ అనే అంటారు. నా చలనానికి జీవం పోసి, నన్ను మనుషుల్లో నిలబెట్టిన, నా బతుక్కో పరమార్థాన్ని కల్పించిన ఆ మహామనిషి అర్థాంతరంగా నన్ను వొదిలేసి పోయారు. కన్నీళ్లన్నీ ఇంకిపోయాయి. మనుషులు పోతారని తెలుసు. కానీ ఇలాంటి గొప్ప మనుషులు, పరోపకారులు, సంస్కార హృదయులు, సాహితీ ప్రియులు పోవడం బాధకలిగిస్తుంది.
నేను నా కోసమే ఏడ్వడం లేదు. అతనున్నప్పుడు నేనెంత కళకళలాడుతూ ఉండేదాన్నో, నా చుట్టూ జ్ఞాన చక్షువులు ఎన్నో ముసురుకునేవి. నా కోసమే ఎదురు చూసేవి. అదలా వుంచితే, తోపుడు బండి సాధిక్ భారు వుంటే, ఎంతోమంది యువత, తమ భవిత భరోసాతో కొనసాగేదని, చదువులు వెలిగేవని, తోడొకరున్నారనే ధైర్యం ఎంతో మందిలో కలిగేది కదా! పోయిన మనుషులు ఎందుకు గుర్తుంటారంటే, ఇదిగో ఇలాంటి పనులు బతికున్నప్పుడు చేస్తేనే. పోయింతర్వాత కూడా బతికుండటమంటే ఇదేమరి! సాధిక్ భయ్యా లేని చోటు నాకే కాదు, ఇదిగో, ఎంతోమందికి వెలితిని మిగిల్చిపోయాడు. బఠానీలు, పుట్నాలు, పల్లీలు కుప్పలుగా పోసుకుని తిరిగే నేను అక్షరాల కుప్పల్ని తలకెత్తుకున్నందుకు ఈ మాత్రం జ్ఞాపకాల్ని పంచుకోగలుగుతున్నాను. మరచిపోయాను డిసెంబరు రాగానే నాకు సందడే సందడి! సాధిక్ భారుకు తీరికే ఉండేది కాదు. పుస్తకాల పండుగలో (బుక్‌ఫెయిర్) రికాము లేకుండా కలియదిరిగేవాళ్లం. దోస్తులు బోలెడుమంది కలిసేవాళ్లు. ఇప్పుడెలా! భయ్యా లేడు. నన్ను తోయందే కదలలేను. ఎవరైనా సాధిక్ భారులా తిరిగి ప్రారంభిస్తారా? మంచి మనుషులు అందించిన పనులను, వారి అనంతరం ఎవరైనా సాగించాలి కదా! ఎవరున్నారు!
– కె.ఆనందాచారి, 9948787660