నిరంకుశత్వం, అణచివేతల పర్వంలో సార్వత్రిక సమరం

In the era of tyranny and oppression Universal struggle– ఇది రిగ్గింగ్‌తో సమానం
– ప్రతిపక్షాలపై వేధింపులు : ఆర్థికవేత్త జీన్‌ డ్రీజ్‌ వ్యాఖ్య
న్యూఢిల్లీ: నిరంకుశత్వం, ప్రతిపక్షాల గొంతుకల అణచివేతల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త జీన్‌ డ్రీజ్‌ విమర్శించారు. బీజేపీ అనుసరిస్తున్న ఈ వైఖరి రిగ్గింగ్‌తో సమానమని చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రముఖ రచయిత అరుంధతీ రారు చేసిన వ్యాఖ్యను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ, ప్రతిపక్షాల మధ్య జరిగిన పోటీని ఇటలీ స్పోర్ట్స్‌ కారు ఫెర్రారీ, కొన్ని సైకిళ్ల మధ్య జరిగిన పోరుగా అరుంధతీ రారు వర్ణించారని తెలిపారు. అది ఇప్పటికీ వర్తిస్తుందని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీన్‌ చెప్పారు.
‘సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. ఆ ఫెర్రారీ (బీజేపీ)కి కార్పొరేట్‌ రంగం ఇంధనాన్ని అందిస్తోందన్న విషయం మనకు తెలుసు. అదే సమయంలో జార్ఖండ్‌ ముక్తిమోర్చా, జనతాదళ్‌, కాంగ్రెస్‌ వంటి సైకిళ్లను (ప్రతిపక్షాలు) ఓ పద్ధతి ప్రకారం లక్ష్యంగా ఎంచుకున్నారు’ అని జీన్‌ వ్యంగ్యోక్తులు విసిరారు. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. బీజేపీ పాలనలో ప్రతిపక్ష నేతలు సంవత్సరాల తరబడి కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులను భరించాల్సి వచ్చిందని తెలిపారు.
‘జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ కటకటాల వెనుక ఉన్నారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అనేక సందర్భాలలో నిర్బంధాలు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అలాంటి చర్యలను తృటిలో తప్పించుకున్నారు. కానీ ఆ పార్టీ బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపచేస్తున్నారు. బీజేపీకి ప్రమాదకారిగా మారే ఏ రాజకీయ నాయకుడైనా వేధింపుల ముప్పును ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఎన్నికలు రిగ్గింగ్‌ వంటివి కాక మరేమిటి?’ అని ప్రశ్నించారు. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావడంపై జీన్‌ డ్రీజ్‌ హర్షం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఇది పెద్ద ప్రభావమే చూపుతుందని ఆయన తెలిపారు.