సమాఖ్యవాద సూత్రాలకు పూర్తి విరుద్ధం

– కువైట్‌ వెళ్ళేందుకు కేరళ ఆరోగ్య మంత్రికి అనుమతి నిరాకరణపై మోడీకి కేరళ సీఎం లేఖ
తిరువనంతపురం : ఇటీవల కువైట్‌లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అక్కడి సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు కువైట్‌ వెళ్ళడానికి కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జికి విదేశాంగ శాఖ రాజకీయ అనుమతి నిరాకరించడంపై ప్రధాని నరేంద్ర మోడీకి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఒక లేఖ రాశారు. ఇలా అనుమతి నిరాకరించడమనేది సహకార సమాఖ్యవాదం సిద్ధాంతాలకు సూత్రాలకు పూర్తి వ్యతిరేకమని విజయన్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 15న ఆయన ఈ లేఖ రాయగా 19న బహిరంగ పరిచారు. భవిష్యత్తులోనైనా ఇలాంటి అభ్యర్ధనలు వచ్చినపుడు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందిగా విదేశాంగ శాఖకు సూచించాల్సిందిగా కోరారు.
కువైట్‌కు మంత్రి వెళ్ళి వుంటే విదేశాంగ సహాయ మంత్రితో, అధికారుల బృందంతో, ఎంబసీతో అనుసంథానించేందుకు చాలా దోహదపడి వుండేదని ఆయన పేర్కొన్నారు. పైగా దీనివల్ల బాధితుల కుటుంబాలకు మానసికంగా ఉపశమనం కలగడంతో పాటూ వారి కుటుంబాల్లో విశ్వాసం నెలకొనేదన్నారు. కువైట్‌ అగ్ని ప్రమాదంలో 49మంది మరణించారు. వీరిలో 23మంది కేరళీయులే వున్నారు. ఆపత్కాలంలో వివాదాన్ని సృష్టించడచం తన ఉద్దేశం కాదని విజయన్‌ పేర్కొన్నారు. రాజకీయ అనుమతి కోసం చేసిన అభ్యర్ధనపై స్పందించలేదన్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్ళకపోతే అది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర క్యాబినెట్‌ తీసుకున్న సమిష్టి నిర్ణయాన్ని విస్మరించారు. 2023 ఫిబ్రవరి 28నాటి క్యాబినెట్‌ సెక్రెటేరియట్‌ ఆఫీస్‌ మెమోరాండం ప్రకారమే రాజకీయ అనుమతి కోరాం. అనుకోకుండా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఈ అభ్యర్ధన కూడా చేయాల్సి వచ్చింది. అయినా ఇలాంటి అభ్యర్ధనలను పట్టించుకోకుండా అనుమతి నిరాకరించడమంటే సమాఖ్యవాదం సూత్రాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని విజయన్‌ తన లేఖలో పేర్కొన్నారు. అభివృద్ధి పంధాను అనుసరించే క్రమంలో, ప్రజలు ప్రకృతి విపత్తులు ఎదుర్కొనే సమయంలో కేంద్ర, రాష్ట్రాలు సమాన భాగస్వాములని ఆ లేఖలో విజయన్‌ పేర్కొన్నారు.
ఇటువంటి అనుమతులు జారీ చేసేటపుడు ఎలాంటి రాజకీయ పరిగణనలు అడ్డు రాకూడదని విజయన్‌ మోడీకి స్పష్టం చేశారు. తీసుకునే నిర్ణయం ఏదైనా ఇటువంటి పక్షపాతం కనిపించరాదన్నారు.
భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనపుడు విదేశాంగ శాఖ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేలా సూచించాల్సిం దిగా ప్రధానిని విజయన్‌ కోరారు. ఆరోగ్యకరమైన సహకార సమాఖ్యవాద వాతావరణాన్ని సృష్టించడానికి కేంద్రం, రాష్ట్రాల మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొని వుండడం చాలా కీలకమని ఆయన స్పష్టం చేశారు.