ఆ సీట్లల్లో టఫ్‌ ఫైట్‌ హేమాహేమీల బరి..

– అసెంబ్లీ ఎన్నికలపై గురి
– జనం చూపంతా అటువైపే
– సత్తా చాటేయత్నంలో బడానేతలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఎన్నికలు..ప్రజాస్వామ్యానికి ప్రతీక. రాజ్యాంగం కల్పించిన హక్కు. జనం పిడికిలి బిగించడానికి ఉన్న అవకాశం. గొంతు పెకిలించే రణనినాదం. ప్రజలు స్వేచ్ఛగా తమ పాలకులను ఎన్నుకునే అపురూప మైన విధానం. దేశంలో ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో తెలంగాణ ఎన్నికలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. ఖరీదైన ఎన్నికలంటూ భారీగా ప్రాపగండా జరుగుతున్న వేళ ఉద్ధండులైన నేతలు బరిలో దిగారు. దీంతో ఆసక్తినిరేపుతున్నాయి. భారీ కప్పదాట్ల మధ్య అసెంబ్లీ ఎన్నికలకు మరో 19 రోజుల సమయమే మిగిలింది. ఈనెల 30న పోలింగ్‌ నేపథ్యంలో ప్రచారం ఊపందుకున్నది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియో జకవర్గాలకుగాను సుమారు 20 నుంచి 25 స్థానాల్లో గట్టి పోటీ నెలకొంది. ప్రధాన నేతలంతా తలపడు తుండటంతో బరి రంజుగా మారింది. సహజంగానే ఇప్పుడు కామారెడ్డిపై అందరిచూపు ఉంది. అక్కడ సీఎం కేసీఆర్‌, ప్రతిపక్ష నేత రేవంత్‌రెడ్డి పరస్ఫరం సవాల్‌చేసుకుంటున్నారు. ఆతర్వాత గజ్వేల్‌లోనూ ఎన్నికపై జోరు చర్చ జరుగుతున్నది. ఇక్కడ సీఎం కేసీఆర్‌ , మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రంగంలో ఉన్నారు. ఇకపోతే పాలేరులో ఉద్ధండులు పోటీ చేస్తున్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ తమ్మినేని వీరభధ్రం, మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్‌రెడ్డి బరిలో నిలిచారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌, సిద్ధిపేటలో హరీశ్‌రావు తమ ప్రత్యర్థులతో తలపడుతున్నారు. మధిరలో కాంగ్రెస్‌ నుంచి భట్టివిక్రమార్క, సీపీఐ(ఎం) నుంచి పాలడుగు భాస్కర్‌, ఖమ్మంలో మంత్రి అజరుకుమార్‌, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పోటీలో ఉన్నారు. కరీంనగర్‌ నుంచి బండి సంజరుకుమార్‌ పోటీ చేస్తున్నారు. హుజురాబాద్‌, కోడంగల్‌, హుజూర్‌ నగర్‌, కొల్లాపూర్‌, పాలకుర్తి, కోరుట్ల, ములుగు, సంగారెడ్డి, మల్కాజ్‌గిరి, మేడ్చల్‌, దుబ్బాక, మహేశ్వరం, మిర్యాలగూడ, నల్లగొండ, మునుగోడు, కొత్తగూడెం తదితర నియోజకవర్గాల్లో పోటీ రసవత్తరంగానే సాగుతున్నది. ఆయా స్థానాల్లో పోటీచేస్తున్నవారంతా తమ సత్తా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్న బడానేతలే. తమకు తాము గెలవడంతోపాటు ఇతరులను విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత ఉన్నవారు. వీరిలో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూలకంటి రంగారెడ్డి, మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి తోపాటు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క పోటీచేస్తున్న ప్రముఖుల్లో ఉన్నారు. ప్రజలందరి చూపు ఆయా నియోజకవర్గాలపైనే ఉంది. పోలింగ్‌ దగ్గరపడుతున్నకొద్దీ చెమడొస్తున్నారు. సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజల్లోకి దూసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా వీలైతే అలా జనం దగ్డరకు వెళ్లి ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు రకరకాల రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఏకంగా ఏడుగురు ఎంపీలు పోటీచేస్తుండటం గమనార్హం.