– నిధుల లభ్యతలో 72% పతనం
– ఈ ఏడాది 50వేల కోట్లకే పరిమితం
– ఐదేళ్లలో అతి కనిష్టం..
న్యూఢిల్లీ: భారత్‌లోని స్టార్టప్ సంస్థలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటు న్నాయి. నిధుల సమీకరణలో తీవ్ర సవాళ్లను చవి చూస్తున్నాయి. గతేడాదితో పోల్చితే ప్రస్తుత ఏడాదిలో నిధుల లభ్యతలో 72 శాతం పతనాన్ని చవి చూశాయని ఓ రిపోర్ట్‌లో వెల్లడయ్యింది. 2023లో ఇప్పటి వరకు 7 బిలియన్ డాలర్లు (దాదపు రూ.58 వేల కోట్లు) నిధులు అందాయని మార్కెట్ ఇంటిలిజెన్సీ వేదిక ట్రాక్స్‌న్ జియో తన ఇంటియా టెక్ 2023 వార్షిక రిపోర్ట్‌లో వెల్లడించింది. గతేడాది మొత్తంగా 25 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2లక్షల కోట్లు) నిధులు సమీకరించగలిగాయని తెలిపింది. 2023లో అంతర్జాతీయంగా అత్యధికంగా నిధులు సమీకరించిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది.
కాగా ప్రస్తుత ఏడాది నాలుగో త్రైమాసికంలో స్టార్టప్‌లు 957 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8వేల కోట్లు) నిధులను సమీకరించాయి. 2016 మూడో త్రైమాసికం తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి నిధుల సమీకరణ పడిపోయిందని ట్రక్స్‌న్ జియో వెల్లడించింది. 2022లో 15.6 బిలియన్ డాలర్ల నిధులను అందుకున్నాయి. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు 17 ఫండింగ్ రౌండ్లలో ప్రతీ దఫాలో సగటున 100 మిలియన్ డాలర్ల చొప్పున నిధులను సమీకరించాయి. నిధుల సమీకరణలో పోన్‌పే అత్యధికంగా 750 మిలియన్ డాలర్లను అందుకుంది. కాగా స్టార్టప్‌ల నుంచి గతేడాది 19 సంస్థలు ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు రాగా.. ఈ ఏడాది 18 టెక్ సంస్థలు ఇష్యూకు వచ్చాయి. ఇందులో యాత్ర, ఇక్లో లైటింగ్ లాంటి కీలక సంస్థలు ఉన్నాయి. కాగా.. బెంగళూరు, ముంబయి, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని స్టార్టప్‌లు అధిక ఫండింగ్స్‌ను ఆకర్షించాయి.
”2023లో నిధుల లభ్యతలో మందగమనం భారత స్టార్టప్‌లకు సవాళ్లను విసురుతోంది. అయినప్పటికీ భవిష్యత్తు ఆశాజనకంగానే ఉంది. ప్రభుత్వ విధానాలకు తోడు వేగంగా అభివృద్థి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో భారత్ మంచి స్థానంలో ఉందని నమ్ముతున్నాము. మా దృష్టి కొత్త ఆవిష్కరణ, విలువను సృష్టించడంపైనే ఉంటుంది. పరిశ్రమ పుంజుకుంటుంది. అభివృద్థి చెందుతుందని మేము విశ్వసిస్తున్నాము.” అని ట్రాక్స్‌న్ జియో సహ వ్యవస్థాపకురాలు నేహా సింగ్ అన్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఆర్థిక మందగమనం.. టెక్ కంపెనీలు పొదుపు చర్యలకు దిగడం తదితర అంశాలు స్టార్టప్‌ల నిధుల సమీకరణలో ప్రతికూలతలను పెంచుతున్నాయి. ఈ రంగంలో ఫండింగ్ తగ్గిపోవడంతో పాటు భారీగా ఉద్యోగాలు ఊడుతోన్న విషయం తెలిసిందే. స్టార్టప్‌లకు నిధుల మద్దతులో కేంద్ర ప్రభుత్వం సరైన విధానాన్ని అనుసరించకపోవడం, బడా కార్పొరేట్లకు కొమ్ము కాయడం వల్లే అవి ఒత్తిడిలోకి జారుకుంటున్నాయని.. కొత్తవి రాలేకపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి.