పర్యాటక శాఖ హోటళ్ళు, రిసార్టుల ప్రయివేటీకరణను ఆపాలి

– కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ పర్యాటక శాఖ సంస్థకు చెందిన హరిత హోటళ్ళు, రిసార్టులను ప్రయివేటీకరణ చేసే ఆలోచనను ఉపసంహారించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు జె వెంకటేశ్‌, ఉపాధ్యక్షులు పద్మశ్రీ, ప్రధాన కార్యదర్శి జె కృష్ణారెడ్డి, కార్యదర్శి జె కుమారస్వామి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతూ అభివృద్ధి చెందుతున్న వాటిని ప్రయివేట్‌ వ్యక్తులకు అప్పగించేందుకు పర్యాటక సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే కడెం రిసార్టు, హైదరాబాద్‌లోని తామతి-బారాదరి, నిజామాబాద్‌ అనంతగిరి హిల్స్‌ ఈ జాబితాలో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ టూరిజం ప్రపంచవ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతలు సంపాదిస్తున్నదనీ, ఈ హోటళ్లకు,రిసార్టులకు కోట్ల రూపాయల విలువ చేసే భూములు, భవనాలు ఉన్నాయని పేర్కొన్నారు. వీటిల్లో పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది 20 ఏండ్లకు పైగా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. 8 నెల్ల క్రితం ప్రజా పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిం చటమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం టూరిజానికి చెందిన హోటళ్ళు, రిసార్టులను ప్రయివేటీకరించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.