ప్రతి సంవత్సరం నవంబర్ 14న మన దేశంలో పిల్లల దినోత్సవాన్ని జరుపుకుంటారు. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినం ఈ రోజుగా జరుపుతూ, పిల్లలపై ఆయనకు ఉన్న ప్రేమను స్మరించుకుంటాం. ‘చాచా నెహ్రూ’ అని పిల్లలు ఆయన్ను ప్రేమగా పిలుస్తారు. ఈ రోజును పిల్లల కలలు, ఆకాంక్షలు, ఆశయాలు సాకారం అయ్యే దిశగా వారిని ప్రేరేపించడానికి ఒక అవకాశం.
కాలం మారిపోయింది. పిల్లలు మారిపోయారు. ఎంతలో ఎంత మార్పు. మా రోజుల్లో మేం ఇలా పెరిగామా..? అని మదనపడుతున్న తల్లిదండ్రులారా..! నేటి కాలంలో పిల్లల పెంపకమే ఓ పెద్ద సవాల్..! పిల్లల పెంపకానికి తల్లిదండ్రులకు కావాల్సింది కేవలం ఒక మంచి ఆశయం మాత్రమే కాదు, ఆ ఆశయాన్ని ఆధారంగా చేసుకుని, ఒక బహత్కార్యాన్ని సవ్యంగా నిర్వర్తించగలిగే సామర్థ్యం.
పిల్లల కలలను నిజం చేసే ప్రేరణ: మన దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లో ఉంది. వారు భవిష్యత్ నేతలు, శాస్త్రవేత్తలు, కళాకారులు, రచయితలు, ఇంకా ఎన్నో రంగాల్లో ఎదిగే అవకాశం; వారి ఆలోచనలకు, ఇష్టాలకు, సాధనలకు ప్రోత్సాహం ఇవ్వడం ఎంతో ముఖ్యం. పిల్లలకు చదువుతో పాటు మంచి విలువలు, సహనం, సహాయసూక్తి అలవడాలి. వారి చిన్న ఆశలను పట్టించుకోవడం ద్వారా, వారు తమ భవిష్యత్తును స్వతంత్రంగా నిర్మించుకోవచ్చు.
పిల్లల ఆశలను అర్థం చేసుకోవడం: ప్రతీ పిల్లలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వారి కలలు, ఆశయాలు భవిష్యత్తులో సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. పిల్లలకు మనం అండగా ఉండి, వారిలోని కలలకు ప్రేరణనివ్వాలి.
పిల్లల వ్యక్తిత్వ వికాసం: పిల్లల వ్యక్తిత్వం, వారి వ్యక్తిగత గుణాలు, ఆలోచనా ధోరణులు, ప్రవర్తనా విధానాలను నిర్మించడంలో చాలా ప్రాధాన్యత ఉంది. వ్యక్తిత్వం అంటే వ్యక్తికి ప్రత్యేకతనిచ్చే లక్షణాల సమాహారం. పిల్లలు ఎదిగేవయసులోనే చుట్టూ ఉన్న పరిస్థితులు, కుటుంబ వాతావరణం, స్నేహితులు, ఇంకా విద్యాశాల సాంఘిక అంశాలు వారి వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి.
వ్యక్తిత్వ వికాసంలో ప్రధాన అంశాలు :
ఆత్మవిశ్వాసం, సురక్షిత భావం : పిల్లలు చుట్టూ ఉన్నవారి నుండి ప్రేమ, సానుభూతి పొందినపుడు, వారు సురక్షితంగా వుంటారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, తద్వారా తమలోని ప్రతిభను, సాహసాన్ని ప్రదర్శించగలరు.
విజ్ఞానం, అన్వేషణ : పిల్లలకు పరిసరాల అవగాహన సహజం. చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి, వారి వ్యక్తిత్వ వికాసంలో కీలకమైన భాగం. వారి ప్రశ్నలను, ఆలోచనలను ప్రోత్సహించడం ద్వారా విజ్ఞానాన్ని నేర్చుకుంటారు. ఇది వారి సజనాత్మకతను, పరిశోధనా గుణాలను పెంచుతుంది.
ప్రభావశీలం, అనుకూలత : పిల్లలు చుట్టూ ఉన్న వాతావరణం నుండి ప్రభావితమవుతారు. పిల్లలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మిత్రుల ప్రవర్తన అనేక మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. పిల్లలు ఎటువంటి పరిస్థితినైనా స్వీకరించే సామర్థ్యాన్ని క్రమంగా అభివద్ధి చేసుకోవడం ముఖ్యం.
మంచి విలువలు, సామాజిక బాధ్యత: పిల్లలకు చిన్నప్పటి నుండే సరైన విలువలను నేర్పిస్తే, వారు బాధ్యతగా, నైతికంగా, పరస్పర గౌరవాన్ని పెంపొందించుకుంటారు. ఎదుటివారి భావాలను అర్థం చేసుకుంటారు.
మానసిక లావణ్యం : పిల్లలు సాంఘిక వాతావరణంలో క్రమంగా తమ భావోద్వేగాలను నియంత్రించడం, విపత్తులను అధిగమించడం నేర్చుకుంటారు. వారి తల్లిదండ్రులు, గురువులు ఇచ్చే మద్దతు వారి మానసిక ధడత్వాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
వ్యక్తిత్వ వికాసంలో తల్లిదండ్రుల పాత్ర:
ప్రోత్సాహం, సహనం : తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వేచ్ఛ ఇచ్చి, వాళ్ళ ప్రవర్తనను అర్థం చేసుకుంటే పిల్లల మానసిక పరిపక్వత పెరుగుతుంది.
సమయాన్ని గడపడం : తల్లిదండ్రులు తమ పిల్లలతో కొంత సమయం గడపడం, వారితో ఆడటం, మాట్లాడటం, వారి ఆసక్తులపై దష్టి సారించడం చాలా ముఖ్యం.
దారదర్శకత్వం: పిల్లలను నియంత్రించే బదులు వారికి గైడ్‌లా ఉండాలి. వారి సందేహాలను తీర్చి ప్రోత్సహించడం వల్ల నిర్భయంగా ఎదుగుతారు.
పిల్లల వ్యక్తిత్వ వికాసం ఎప్పటికీ అభివద్ధి చెందే ప్రక్రియ. వారికి సానుకూల వాతావరణం, సరైన దారదర్శకత్వం, ఎలాంటి పరిస్థితినైనా అధిగమించగల సామర్థ్యం సాధించడానికి అవకాశాలు ఇవ్వడం ద్వారా, వారిలో నైపుణ్యాలను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చు.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్