– అధికారులను ఆదేశించిన ఏసీబీ కోర్టు
రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితుల రీత్యా టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. చంద్రబాబు ఆరోగ్యంపై విజయవాడ ఏసీబీ కోర్టులో శనివారం సాయంత్రం హౌస్ మోషన్ పిటిషన్‌ను ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. సిద్దార్ధలూథ్రా, జి. సుబ్బారావు ఆన్‌లైన్‌లో వాదనలు వినిపించారు. ఆయన ఛాతీ, చేతులు, మెడ, గడ్డం, వీపు తదితర శరీర భాగాల్లో దద్దుర్లు, స్కిన్ అలర్జీ ఉన్నట్లు గుర్తించి. చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ జిజిహెచ్ వైద్యులు ఇచ్చిన నివేదికను వారు న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయ మూర్తి వైద్యుల సూచనకు అనుగుణంగా చంద్రబాబు బ్యారక్‌లో చల్లదనం ఉండేలా టవర్‌ఎసిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జైలులో చంద్రబాబుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. జైలులో ఎసి పెట్టేందుకు నిబందనలు ఒప్పుకోవని, కోర్టు ఆదేశిస్తే చూస్తామని జైళ్లశాఖ డిఐజి రవికిరణ్ చెప్పిన విషయం తెలిసిందే.
జైలు వద్ద ఉత్కంఠ
శనివారం ఉదయం నుండి జైలు వద్ద ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు ఆరోగ్యంపై మీడియాలో వార్తలు రావడం, వైద్యలు ఇచ్చిన నివేదిక వెల్లడి కావడం, ఈ విషయాన్ని బాబు తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించడం తదితర అంశాల్లో జైలు అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు శనివారం ములాఖత్‌కు వచ్చిన బాబు కుటుంబ సభ్యులు జైలు అధికారుల తీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జైళ్లశాఖ డిఐజి రవికిరణ్‌తో లోకేష్ వాగ్వివాదానికి దిగినట్లు సమాచారం, చంద్రబాబు అస్వస్థత రీత్యా ప్రత్యేక సదుపాయాలు అవసరమని వైద్యులు సూచించినా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. . తన తల్లి నారా భువనేశ్వరి, టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో కలిసి చంద్రబాబుతో లోకేష్ సోమవారం ములాఖత్ అయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల వరకూ ములాఖత్ జరిగింది. ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడకుండా లోకేష్, భువనేశ్వరి వెళ్లిపోయారు. కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబుతో చర్చించినట్టు తెలిపారు.
పరిశీలించిన వైద్యబృందం
ఈ పరిణామాల నేపధ్యంలో జైలు అధికారుల విజ్ఞప్తితో డాక్టర్ శివకుమార్ నేతృత్వంలో ఐదుగురు వైద్యుల బృందం చంద్రబాబుకు శనివారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం జైలు కాన్ఫరెన్స్ హాలులో జైళ్ల శాఖ డిఐజి రవికిరణ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శివకుమార్ వివరాలను వెల్లడించారు. చంద్రబాబుకు సుగర్, బిపి, ఊపిరితిత్తులు, టెంపరేచర్ తదితర పరీక్షలన్నీ నార్మల్‌గా ఉన్నట్టు తెలిపారు. కేవలం చర్మ సంబంధిత సమస్య మాత్రమే ఉందని చెప్పారు. ఆయన తీసుకుంటున్న ఆహారం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం 67 కేజీల బరువు ఉన్నారని చెప్పారు. ఎండవేడిమి కారణంగా డీహైడ్రేషన్ సహజమని, చెమట ఎక్కువగా పట్టడడంతో రాషెస్ వస్తుంటాయని తెలిపారు. చల్లని వాతావరణం అవసరమని జైలు అధికారులకు సూచించామని తెలిపారు
బాబు బ్యారక్‌లో టవర్ ఏసీ
2:18 am