నారాయణఖేడ్‌ ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలి : టీపీటీఎఫ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయులపై లాఠీచార్జీ చేయించిన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి పి నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. పార్లమెంటు ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులు నిబంధనల ప్రకారం రావాల్సిన ఐదు రోజుల భత్యం ఇవ్వాలని కోరితే పోలీసులతో లాఠీచార్జీ చేయించడాన్ని మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. న్యాయంగా రావాల్సిన వేతన భత్యాలను ఇవ్వాలని అడిగితే పోలీసులతో బలప్రయోగం చేయడం అత్యంత దారుణమని విమర్శించారు. నిబంధనల ప్రకారం రెమ్యూనరేషన్‌ ఇవ్వకుండా లాఠీచార్జీకి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఈవో వికాస్‌రాజ్‌కు వినతిపత్రం సమర్పించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరకమైన రెమ్యూనరేషన్‌ చెల్లించాలని కోరారు.
ఉపాధ్యాయులపై లాఠీచార్జీ అన్యాయం : టీఎస్‌సీపీఎస్‌ఈయూ
ఉపాధ్యాయులపై సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో లాఠీచార్జీ చేయించడం అన్యాయమని టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఉపాధ్యక్షుడు మ్యాన పవన్‌కుమార్‌ విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులు నిబంధనల ప్రకారం రెమ్యూనరేషన్‌ చెల్లించాలని అడిగితే లాఠీచార్జీ చేయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 1951 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికలనూ విజయవంతం చేయడంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని తెలిపారు. వారిని అభినందించాల్సిందిపోయి లాఠీచార్జీ చేయించడం దారుణమని పేర్కొన్నారు. ఈ ఘటనపై సీఈవో విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహించిన వారికి ఒకే విధమైన రెమ్యూనరేషన్‌ చెల్లించాలని కోరారు. జరిగిన పొరపాట్లను సరిచేయాలని సూచించారు.
నారాయణఖేడ్‌ ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలి : సీఈవోకు టీఆర్టీఎఫ్‌ లేఖ
సమాన రెమ్యూనరేషన్‌ చెల్లించాలని కోరిన ఉద్యోగ, ఉపాధ్యాయులపై నారాయణఖేడ్‌లో పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని టీఆర్టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్‌, ప్రధాన కార్యదర్శి కావలి అశోక్‌కుమార్‌ ఖండించారు. ఆ ఘటనకు కారకులైన స్థానిక ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని సీఈవో వికాస్‌రాజ్‌కు వారు మంగళవారం లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకరీతి రెమ్యూనరేషన్‌ చెల్లించలేదని తెలిపారు. సమాన రెమ్యూనరేషన్‌ను చెల్లించాలని కోరారు. భద్రాచలంలో ఎన్నికల విధుల్లో ఉన్న పి మధుకుమార్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో హైదరాబాద్‌లో అత్యవసర చికిత్స విభాగంలో ఉన్నారనీ, ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు.
వేసవి సెలవుల్లోనే బదిలీలు, పదోన్నతులు పూర్తి చేయాలి
టెట్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు నిలిచిపోయిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను ప్రారంభించాలని విద్యాసంవత్సరం నష్టపోకుండా వేసవి సెలవుల్లోనే పూర్తి చేయాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశానికి టీఆర్టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్‌, ప్రధాన కార్యదర్శి కావలి అశోక్‌కుమార్‌ లేఖ రాశారు. హైకోర్టు ఉత్తర్వులను ఉపాధ్యాయులందరికీ వర్తింపజేయాలని కోరారు.