ఖమ్మంలో అక్టోబర్‌లో టీపీటీఎఫ్‌ రాష్ట్ర మహాసభ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ప్రొగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌) రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో అక్టోబర్‌ మూడోవారంలో జరగనున్నాయి. టీపీటీఎఫ్‌ రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్‌ కుమార్‌ అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. అనంతరం టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి నాగిరెడ్డి, అదనపు ప్రధాన కార్యదర్శి ఎం రవీందర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. దీంతో విద్యారంగం రోజు రోజుకూ సంక్షోభంలో కూరుకుపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కామన్‌ సర్వీస్‌ రూల్స్‌, పండితులు, పీఈటీల అప్‌గ్రెడేషన్‌ కోర్టుల్లో నానుతున్నాయని తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం రద్దు పాలకుల దయా దాక్షిణ్యాల పరిధిలోకి వెళ్లిందని పేర్కొన్నారు. పీఆర్సీ గడువు గతనెల 30తో ముగిసినప్పటికీ ఐఆర్‌ ఊసేలేదు విమర్శించారు. నూతన పీఆర్సీని వేయాలని డిమాండ్‌ చేశారు. 317 జీవో వల్ల వేలాది మంది ఉపాధ్యాయులు బాధితులుగా మారారని తెలిపారు. విద్యారంగానికి నిధుల కేటాయింపులు రోజురోజుకూ తగ్గిస్తున్నారని పేర్కొన్నారు. పదోన్నతులు, నియామకాలు చేపట్టక పోవడం వల్ల పర్యవేక్షణ అధికారులు, ఉపాధ్యాయుల్లేక పాఠశాలలు కునారిల్లుతున్నాయని తెలిపారు. ప్రజానుకూల విద్యను ప్రయివేటీకరణను బలోపేతం చేయడం కోసమే జాతీయ విద్యావిధానం-2020ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ప్రధాన అంశంగా ఉచిత నిర్బంధ విద్య, కామన్‌ స్కూల్‌ విధానం, శాస్త్రీయ విద్య, విద్యారంగ సమస్యలపై ఖమ్మం పట్టణంలో అక్టోబర్‌ మూడో వారంలో మహాసభలను నిర్వహిస్తామని తెలిపారు.