– ఉత్సవ విగ్రహాల్లా రైతు వేదికలు
– ముంచుకొస్తున్న ఖరీఫ్ సీజన్
– సాగు ప్రణాళికలు, విత్తనాలు, ఎరువులు..
– పంట రుణాలన్నీ పై ఆదేశాల మేరకే అమలు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి సాగు విధానంలోనూ పంటల మార్పు అనివార్యం. నూతన వంగడాలు, సాంకేతికత, పంటల సాగుకు ప్రభుత్వాల ప్రోత్సహాకాలతో పాటు అనుకూల వాతావరణం ఉంటేనే వ్యవసాయం గిట్టుబాటు అయ్యేది కష్టం. కానీ.. ఎండా కాలంలో వానలు పడడం, వానాకాలంలో ఎండలు కాయడం వంటి అసమతుల్య వాతావరణ పరిస్థితుల్లో రైతులకు వివిధ ఆంశాల పట్ల అవగాహన కల్పించి, శిక్షణ ఇవ్వాలి. అందుకే వారి వద్దకెళ్లి పలు సూచనలు, సలహాలిచ్చేందుకు రైతు చైతన్య యాత్రల ద్వారా అధికారులందరూ గ్రామాలకెళ్లేది. ఆ యాత్రలను ఆపేసి ప్రత్యామ్నాయంగా నిర్మించిన రైతు వేదికలు ఉత్సవ విగ్రహాలయ్యాయి. అధికారులెవ్వరూ ఆ భవనాలకు వెళ్లడం లేదు. విపత్కర పరిస్థితుల్లోనూ అధికారులు రైతులకు రైతు వేదికల్లో అందుబాటులో ఉండటం లేదు.
రైతు చైతన్య యాత్రల వల్ల మేలు
రైతు చైతన్య యాత్రల వల్ల రైతులకు ఎన్నో ఉపయోగాలున్నాయి. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, పశుసంవర్థక, విద్యుత్, ఇరిగేషన్ శాఖ లీడ్, డీసీసీబీ, ఇతర బ్యాంకు అధికారులు, వ్యవ సాయ శాస్త్రవేత్తలు రైతు చైతన్య యాత్రల్లో పాల్గొనేవారు. రాష్ట్రంలోని ప్రతి మండ లంలోని అన్ని గ్రామా ల్లో పర్యటించేలా 15 రోజుల పాటు షెడ్యూల్ ఖరారు చేసి అధికారుల బృందాలు పర్యటిం చేవి. 12,500 గ్రామాల్లో యాత్రలు జరిపితే సుమారు 13 లక్షల మంది రైతులు హాజరయ్యేవారు. ఊర్లల్లో రైతులతో సమావేశం జరిపి వ్యవసాయ సీజన్ సన్నద్ధతపై ఖరీప్ ప్రణాళి కల్ని వివరించేవారు. మార్కె ట్‌లోకి వచ్చిన కొత్త వంగ డాలు, విత్తనాలు ఎప్పుడు వేసుకోవాలి, ఏఏ పంటకు ఎంత మద్ధతు ధర, మార్కె ట్‌లో డిమాండ్ ఉన్న పంట లేవనే విషయాలు వివరించే వారు. సాగులో తీసు కోవాల్సిన జాగ్రతలు, సస్యరక్షణ, వాతావరణ పరిస్థితులు, వర్ష పాతం, సాగునీటి వనరులు, విద్యుత్ సరఫరా, ఎరువులు, విత్తనాల స్టాక్, ధరల పట్టిక వంటి విషయాలు చెప్పేవారు. ఏ పంటకు ఎంత రుణమి స్తారనేది బ్యాంకర్లు వివరించే వారు.. చెరువులు, ప్రాజెక్టుల కింద నీటి విడుదల, వ్యవసా యానికి 24 గంటల కరెంట్ సరఫరా, విద్యుత్ కనెక్షన్ల మంజూరీ, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలకు పరిష్కారం చూపేవారు.. రైతు బంధు, రైతు బీమా, పంట నష్టం, బీమా పథకాలపై అవగాహన కల్పింవారు.. భూ సమస్యలకూ పరిష్కారం చూపేవాళ్లు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం చేపడుతున్న పథకాల్ని వివరించేవారు.. వివిధ శాఖల అధికారులు మాట్లాడి అవగాహన కల్పించడం, పలు సూచనలు, సలహాలు ఇవ్వడం వల్ల రైతులకు ఎంతో మేలు జరిగేది. ప్రభుత్వం చైతన్య యాత్రల్ని జరపాలని రైతులు కోరుతున్నారు.
ముంచుకొస్తున్న ఖరీఫ్ సీజన్
ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తుంది. ఖరీఫ్ పంటల సాగు కోసం రైతులు మే నెలలో వేసవి దుక్కులు దున్నుకుం టున్నారు. ఇటీవల వర్షాలు కురిశాయి. ఖరీఫ్‌లో అధికంగా పంటలు సాగవుతాయి. వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, శనగ, చెరకు, కూరగాయల సాగు కోసం విత్తనాలు సమకూర్చుకుంటున్నారు. జూన్ నుంచే వివిధ పంటల విత్తనాలు వేస్తారు. నైరుతీ రుతుపవనాల ప్రభావం ఎలా ఉన్నా సన్నద్ధమయ్యేందుకు రైతులు సిద్దమవుతున్నారు. కాగా, గతేడాది సాగు విస్తీర్ణంకు అటుఇటుగా అంకెల్ని మార్చడం తప్ప క్షేత్ర స్థాయిలో రైతులతో మాట్లాడి వారి ప్రాంతాల్లో ఏఏ పంటలు వేస్తే లాభం, వారికి కావాల్సిన అవసరాలేమిటీ.. అనేది చర్చించడం లేదు. గతేడాది ఖరీఫ్ సీజన్‌లో మెదక్ జిల్లాలో 3,42,838 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 2,83,590 ఎకరాలు, పత్తి 48,000 ఎకరాల్లో సాగైంది. ఇతర పంటలు కలిపి 11,248 ఎకరాల్లో వేశారు. సిద్దిపేట జిల్లాలో 3,61,000 ఎకరాల్లో వరి, 2.10 లక్షల ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు మరో లక్ష ఎకరాల్లో సాగైంది. సంగా రడ్డి జిల్లాలో వివిధ పంటలు కలిపి 7,02,789 ఎకరాల్లో సాగయ్యాయి. వీటిల్లో వరి 1,38,349 ఎకరాలు, పత్తి 3,44,570 ఎకరాలు, కంది 78,157, సోయా చిక్కుడు 79,361, ఇతర పంటలు 62,352 ఎక రాల్లో సాగ య్యాయి. ఈ ఏడాది ఖరీఫ్‌కు కూడా అవే లెక్క ల్ని ఖరీఫ్ ప్రణాళికలుగా అధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో రైతుల్ని కలిసి గతేడాది సాగు అనుభవాలు, నష్టా లు, లాభాల గురించి చర్చించి పంట సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఉత్సవ విగ్రహాల్లా రైతు వేదికలు
రైతులందరికీ ఉపయోగపడేలా రాష్ట్రవ్యాప్తంగా 2500 రైతు వేదికల్ని రాష్ట్రప్రభుత్వం నిర్మించింది. వీటిల్లో రైతులు సమావేశాలు జరుపుకోవడం, వ్యవసాయ అధికారులు వర్క్‌షాప్‌లు పెట్టి వివిద ఆంశాలపై రైతులకు శిక్షణ, అవగాహనా కల్పించడం కోసం వీటిని నిర్మించారు. రైతు చైతన్య యాత్రలకు ప్రత్యామ్నాయంగా రైతు వేదికలు కట్టామని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవంగా రైతు వేదికలు ప్రత్యామ్నాయం కాకుండా ఉత్సవ విగ్రహాల్లా నిరూప యోగంగా మారాయి. క్షేత్రస్థాయికి వెళ్లి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఏఈఓలు రైతుల్ని కలవడంలేదు. వ్యవసాయ, మత్స్య, ఉద్యాన, విద్యుత్, ఇరిగేషన్, పశుసంవర్ధక, మార్కెటింగ్, మదర్ డైయిరీ, లీడ్, డీసీసీబీ, ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంకు అధికారులెవ్వరూ రైతు వేదికలకు రావడంలేదు. వచ్చినా అలా వచ్చి ఇలా వెళ్తున్నారు. తాళాలు వేసి ఉంటున్నాయి. ఇటీవల రాష్ట్రంలో అకాల వడగండ్ల వానలొచ్చి అపారమైన పంట నష్టమేర్పడింది. ధాన్యం రాలిపోయింది. కల్లాల్లో తడిసింది. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఏ అధికారులు వెళ్లలేదు. సీఎం కేసీఆర్ నష్టపరిహారం ప్రకటించి నివేదికలు కోరినా క్షేత్రస్థాయికి అధికార యంత్రాంగం వెళ్లలేదు.
చైతన్య యాత్రల వల్లనే రైతుకు లాభం
రైతు చైతన్య యాత్రలు నిర్వహిం చాలి. గతంలో వీటి వల్ల రైతులకు అనేక విషయాల్లో అవగాహన కలిగేది. అధికారులు ఊర్లకొచ్చి రైతుల సమస్యలు విని పరిష్కరించేవారు. వాటిని జరపకుండా రైతు వేదికలే ప్రత్యామ్నాయం అంటే లాభంలేదు. వాటిని చూసుకుని మురియడం తప్ప అక్కడికి అధికారులు రావట్లేదు. రైతులకు శిక్షణ, అవగాహన సమావేశాలు జరగట్లేదు. ఏఈఓలు వచ్చినప్పుడు రైతులు వెళ్లి కలిసే పరిస్థితి లేదు. రైతు వేదికల్లో గ్రీవెన్స్ డే నిర్శహించాలి.
– రాజయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు