వ్యాపారులు నియమ నిబంధనలను పాటించాలి

Traders must follow the rules– హుస్నాబాద్ ఏసీపీ వి. సతీష్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసే బాణసంచా దుకాణాలలో వ్యాపారులు నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని హుస్నాబాద్ ఏసీపీ వి. సతీష్ అన్నారు. ఆదివారం ఏసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీస్‌, మున్సిపల్ , అగ్ని మాపక శాఖలు, విధ్యుత్ శాఖ నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే అనుమతితో దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. దుకాణాల సమీపంలో ఇసుక, నీరు, రెండు ఫైర్‌ఎక్స్‌ట్రిమిషన్‌లు ఉంచాలని సూచించారు. బాణసంచా విక్రయించే వ్యాపారులతో పాటు టపాకాయలు కాల్చే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అనుమతి లేకుండా బాణసంచా నిల్వ చేసినా, తయారు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణదారులు తప్పని సరిగా తమ లైసెన్సులను రెన్యువల్‌ చేయించుకోవాలన్నారు. టపాసుల దుకాణానికి నిర్ధేశిత రుసుము, విధ్యుత్, ఫైర్‌ శాఖతో పాటు మున్సిపల్ శాఖల ఎన్ఓసి అనుమతి తప్పనిసరి ఉండాలన్నారు. దుకాణాలను జనావాసాల మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయరాదని సూచించారు.