రహదారి విస్తరణ పనులను అడ్డుకున్న వ్యాపారస్తులు

నవతెలంగాణ-కొత్తూరు
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పెంజర్ల రోడ్డు విస్తరణ పనులను వ్యాపారస్తులు అడ్డుకున్నారు. మున్సిపల్‌ అభివద్ధిలో భాగంగా పెంజర్ల రోడ్డును 58 ఫీట్లు విస్తరించాలని అనుమతులు లభించాయి. దీనిని స్థానిక వ్యాపారస్తులు మొదట నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయమై వ్యాపారస్తులు మున్సిపల్‌ అధికారుల పాలకమండలిల మధ్య చర్చలు జరిగాయి. చివరికి మున్సిపల్‌ అధికారులు 53 ఫీట్లు విస్తరించాలని అనుకున్నప్పటికీ వ్యాపారస్తులు దీనిని కూడా వ్యతిరేకించారు. కేవలం 40 ఫీట్ల మేరా వరకే విస్తరించాలని అంతకు మించి ఒక్క ఫీట్‌ ఎక్కువ జరిపిన ఊరుకునేది లేదని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గురువారం మున్సిపల్‌ అధికారులు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. రోడ్డును కబ్జా చేసి కట్టుకున్న షెడ్యూలను మెట్లను తొలగిస్తుండగా వ్యాపారస్తులు ఒక్కసారిగా పనులకు అడ్డు తగిలారు. ఇదే విషయమై కమిషనర్‌ వీరేందర్‌ను ఫోన్లో వివరణ కోరగా పెంజర్ల రోడ్డుకు 58 పేట్ల విస్తరణ కు అనుమతులు ఉన్నాయని అన్నారు. రోడ్డును కబ్జా చేసి వేసుకున్న షెడ్యూలను, మెట్లను మాత్రమే తొలగిస్తున్నాము. వ్యాపారస్తులకు నష్టం చేకూర్చే విధంగా ఎలాంటి భవనాల కూల్చివేతలు చేయలేదు. రోడ్డును అక్రమంగా ఆక్రమించి కట్టుకున్న కట్టడాలను తొలగిస్తాము. రోడ్డు విస్తరణ పనులకు అడ్డు తగలకుండా మున్సిపల్‌ అభివద్ధికి తోడ్పడాలని కమిషనర్‌ కోరారు.