సాంప్ర‌దాయ‌మే జీవ‌నో పాధిగా…

Tradition is life or death...ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు మండలానికి చెందిన ఓ గిరిజన తండా అది. ఇరవై మంది గిరిజన మహిళలు తమ సాంప్రదాయ విజ్ఞానాన్ని స్థిరమైన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. పర్యావరణ అనుకూలమైన విస్తరాకులు, కప్పులను తయారు చేస్తూ జీవనోపాధిని పొందుతూ, గౌరవంగా బతుకుతున్న వారి స్ఫూర్తిదాయక పరిచయం నేటి మానవిలో…
అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ‘అడ్డాకులు’ అని పిలువబడే బౌహినియా వహ్లీ ఆకులు విపరీతంగా దొరుకుతాయి. ఆ పరిసర ప్రాంతాల్లోని గిరిజన ప్రజలంతా ఆ ఆకులతోనే విస్తరాకులు తయారు చేసి ఇంటి అవసరాల కోసం వాడుకుంటారు. ఇవి తరతరాలుగా వారి సాంప్రదాయ ప్లేట్లు. ఈ విస్తరాకులు పర్యావరణ అనుకూలమైనవి కూడా. వాటినే ఇప్పుడు వారు ఉత్పత్తి చేసి విక్రయించడం మొదలుపెట్టారు. తద్వారా గిరిజన మహిళలు పర్యావరణ బాధ్యతను తమ భుజాలపై వేసుకోవడంతో పాటు స్వయం ఉపాధి పొందే మార్గాన్ని కనుగొన్నారు.
ఐదు రకాల ఉత్పత్తులు
పాడేరు ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ITDA) అనే సంస్థ వన్‌ ధన్‌ వికాస్‌ కేంద్రం (VDVK) మద్దతుతో గిరిజన ప్రజల ఆదాయాన్ని పెంచడంలో సహాయపడింది. 2024 ఫిబ్రవరిలో అప్పటి కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ITDA ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (PO) వి.అభిషేక్‌ పాడేరులోని VDVK విస్తారకు సెంటర్‌ను ప్రారంభించారు. ఆ పరిసర గ్రామాల నుండి మహిళలు ఈ బయోడిగ్రేడబుల్‌ ప్లేట్లు, కప్పులను తయారు చేసేందుకు ఈ కేంద్రానికి చేరుకుంటారు. ‘ఆదివారాల్లో కూడా దాదాపు 20 మంది మహిళలు తమ ఇళ్ల వద్దనే ఆకులను కుడతారు. వీలైనవారు కేంద్రానికి వచ్చి యంత్రాలను ఉపయోగించి విస్తరాకులు తయారు చేస్తారు. కేంద్రానికి ఎప్పుడు రావాలని అనే షెడ్యూల్‌ను వారే నిర్ణయించుకుంటారు’ అని డిఆర్‌డిఎ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వి.మురళి ఓ వెబ్‌ సైట్‌తో పంచుకున్నారు. కేంద్రంలో మందపాటి లైన్డ్‌ బఫే ప్లేట్లు, సాధారణ ప్లేట్లు, చేతితో కుట్టిన ప్లేట్లతో పాటు రెండు పరిమాణాల కప్పులతో సహా మొత్తం ఐదు రకాలను తయారు చేస్తున్నారు. వీరు ప్రతిరోజూ దాదాపు 2,000 ప్లేట్లు, కప్పులు ఉత్పత్తి చేస్తున్నారు.
ఆకులను సేకరించి
గిరిజన మహిళలు తరతరాలుగా తమ రోజువారీ ఉపయోగం కోసం ఈ బయోడిగ్రేడబుల్‌ ప్లేట్‌లను తయారు చేసుకుంటున్నారు. కేవలం వారి అవసరాల కోసమే పరిమితమైన ఈ నైపుణ్యం ఇప్పుడు విస్తృత మార్కెట్‌కు చేరి వారికి జీవనోపాధిగా మారింది. ‘విస్తరాకులు తయారు చేయడం మాకు కొత్తకాదు. మేము ఎప్పుడూ చేసే పనే ఇది. అయితే ఇప్పుడు ఇది మాకు స్థిరమైన ఆదాయాన్ని అందించడంలో సహాయపడుతుంది’ అని బి.శాంతి అనే మహిళ అంటున్నారు. గ్రామాల్లోని మహిళలు సీజన్‌లో అంటే మే, జూన్‌లలో విస్తరాకుల కోసం ఆకులను సేకరిస్తారు. వీటిని జాగ్రత్తగా భద్రపరుచుకుంటాము. కేంద్రంలో పని చేసే మహిళలు వారానికొకసారి మహిళల వద్ద ఆకులను సేకరించి తెచ్చుకుంటారు. అప్పుడప్పుడు వీరు కూడా స్వయంగా వెళ్ళి ఆకులను సేకరిస్తారు.
ప్రజల్లో అవగాహన పెరుగుతుంది
ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణం ఎదుర్కొంటున్న సమస్యల గురించి పెరుగుతున్న అవగాహనతో ఈ పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలకు సమాజంలో డిమాండ్‌ పెరుగుతోంది. ‘ప్రజలు స్థిరమైన ఎంపికలను ఎంచుకుంటున్నారు. ఈ మార్పు మంచి అమ్మకాలు, ఆర్థిక స్థిరత్వంపై మాకు ఆశను కలిగిస్తుంది’ అని కేంద్రం ట్రెజరీ అధికారి విజయలక్ష్మీ, విడివికె కార్యదర్శి చిన్నమ్మలు అంటున్నారు. యంత్రాల ఉపయోగం మా ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరిచింది. దాంతో చాలా త్వరగా ప్లేట్లు, కప్పులు తయారు చేయగలుగుతున్నాం. కొనుగోలుదారులను ఆకర్షించే విధంగా శుద్ధి చేసిన ఉత్పత్తులను రూపొందించడానికి యంత్రాలు మాకు సహకరిస్తున్నాయి’ అని కేంద్రం సిబ్బంది చింతా మాధవి అన్నారు.
మహిళలకు స్వావలంబన
జిల్లాలో డిసెంబరు 1 నుండి ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, బ్యాగ్‌లను నిషేధించారు. దాంతో వీరి ప్రాజెక్ట్‌ మరింత ఊపందుకుంది. ‘మొదట్లో వీరు ప్లేట్లను మాత్రమే తయారు చేశారు. ఐటీడీఏ ప్రోత్సాహంతో వారు ఇప్పుడు ప్లేట్లతో పాటు కప్పులను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఉత్పత్తులను ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సరఫరా చేస్తున్నారు. డిసెంబర్‌ 1 నుండి జిల్లాలో ప్లాస్టిక్‌ నిషేధం వల్ల ఈ పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలకు డిమాండ్‌ మరింత పెరిగింది’ అని మురళి అన్నారు. ఈ కేంద్రం నడిచేందుకు విడివికె పథకం ద్వారా రూ.15 లక్షలు, మెషినరీ కోసం రూ.10 లక్షలు, శిక్షణ, సీడ్‌ క్యాపిటల్‌ కోసం రూ.5 లక్షలు కేటాయించారు. ‘మహిళలకు స్వావలంబనకు మార్గం చూపడమే మా లక్ష్యం. ఆకులను సేకరించడం నుండి తుది ఉత్పత్తులను విక్రయించడం వరకు ప్రతిదీ మహిళలే నిర్వహిస్తారు. వారికి మార్గనిర్దేశం చేయడానికి, మద్దతు ఇవ్వడానికి మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాము’ అని పిఓ అభిషేక్‌ అన్నారు.