పెండ్లి వేడుకలో విషాదం

– ఇరాక్‌లో అగ్ని ప్రమాదం 114మంది మృతి
బాగ్దాద్‌ : ఇరాక్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహ వేడుక జరుగుతున్న ఫంక్షన్‌ హాల్‌లో పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 114మంది మరణించగా, 200మందికి పైగా గాయపడ్డారని ఇరాక్‌ ఉత్తర ప్రాంత ప్రావిన్స్‌ అయిన నినెవా గవర్నర్‌ నజ్మ్‌ అల్‌ జుబోరి బుధవారం తెలిపారు. ఆ ప్రావిన్స్‌లోని అల్‌ హమ్‌దనియా పట్టణంలో ఈ విషాదం సంభవించింది. ప్రావిన్స్‌ రాజధాని మోసుల్‌కు అగేయంగా 35కిలోమీటర్ల దూరంలో అల్‌ హమ్‌దనియా పట్టణంలో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయని అధికార వార్తా సంస్థ ఐఎన్‌ఎ తెలిపింది. వివాహ వేడుకలను పురస్కరించుకుని బాణాసంచా కాల్చారని, దానివల్లే మంటలు చెలరేగి వుండవచ్చని ప్రాధమిక సమాచారం తెలియచేస్తోంది.