రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతితో కమ్మర్ పల్లిలో విషాదఛాయలు

– మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు

– అశ్రునయనాల మధ్య అంతక్రియలు పూర్తి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం అడవి ప్రాంతం కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి డీసీఎం వ్యాన్ బోల్తా పడిన సంఘటనలో కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.  ఈ ప్రమాదంలో మరో 15 మంది గాయపడగా వారిని  జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన రేంజర్ల స్వామి కుమారుని పుట్టు వెంట్రుకల కోసం వర్ని మండలం బడాపహాడ్ కు 30 మందితో కలిసి గురువారం రాత్రి డీసీఎం వ్యాన్ లో బయలుదేరారు. రాత్రి 11గంటల సమయంలో నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత  కొత్తపేట శివారులో డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యాన్ క్యాబిన్ లో కూర్చున్న రేంజర్ల శ్యాంసుందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. వీరిని ఆంబులెన్స్ ల్లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా రెంజర్ల వసంత అనే మహిళ మృతి చెందారు. గాయపడ్డ 15 మందిలో కొందరు క్షతగాత్రులకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్సలు అందిస్తున్నారు. ఇందులో తీవ్రంగా గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోనే ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్సలు చేయిస్తున్నారు. గాయపడ్డ వారిలో చిన్నారులు, మహిళలు ఎక్కువమంది ఉన్నారు. వీరంతా కమ్మర్ పల్లికి చెందిన వారే. సంఘటనలో మృతి చెందిన వారి మృతదేహాలను జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయ్యాక శుక్రవారం మధ్యాహ్నం కమ్మర్ పల్లికి తీసుకువచ్చారు. అనంతరం ఇరువురి కుటుంబ సభ్యుల, వేలాదిగా తరలివచ్చిన ప్రజల  అశ్రునయనాల మధ్య ఒకేసారి మృతులు ఇద్దరికీ  వేరువేరుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఓకే ప్రమాదంలో రెండు కుటుంబాలకు సంబంధించిన ఇద్దరు ఒకేసారి మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. అంత్యక్రియలో పాల్గొనందుకు వేలాదిగా ప్రజలు, మహిళలు తరలి రావడంతో కమ్మర్ పల్లి జనసంద్రంగా మారింది.ఈ సంఘటనలో మృతి చెందిన రేంజర్ల శ్యాంసుందర్ కు భార్య భారతి, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతురాలు  రేంజర్ల వసంతకు భర్త నర్సారెడ్డి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.