విజయవాడలో విషాదం

విజయవాడలో విషాదం– నలుగురు కుటుంబ సభ్యులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్‌
– ఆర్థిక ఇబ్బందులే కారణం – కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
విజయవాడ : ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలను మాత్రమే గాక వైద్యుల వంటి మేథోజీవులను అతలాకుతలం చేస్తున్నాయి. పెద్ద మొత్తంలో ఖర్చుచేసి వైద్యవిద్యను చదివినప్పటికీ, కార్పొరేట్‌ చట్రంలో వారు బందీలు కావాల్సిందే! ఎంత నైపుణ్యం ఉన్నా యాజమాన్యాలు ఇచ్చే జీతపు రాళ్లతో సరిపెట్టుకోవాల్సిందే. తెగించి సొంత ప్రాక్టీసు పెట్టుకుందామన్నా దారుణమైన ప్రభుత్వ నిబంధనల కారణంగా అసాధ్యంగా మారుతోంది. అయినా, ధైర్యం చేసి ముందుకెళ్తున్న వారు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. సొంతగా ఆస్పత్రిపెట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక డాక్టర్‌ తాను ఆత్మహత్య చేసుకోవడంతో పాటు, కన్నతల్లిని, కట్టుకున్న భార్యను అభం, శుభం తెలియని ఇద్దరు చిన్నారులను బలిగొన్న దారుణ ఉదంతం మంగళవారం విజయవాడలో చోటుచేసుకుంది.
గురునానక్‌ కాలనీలో చోటుచేసుకున్న ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా వైద్య వర్గాల్లో కలకలం రేపింది. పైకి గంభీరంగా కనిపించే వైద్య వృత్తిలో కనిపించని కష్టాలను చర్చనీయాంశం చేసింది. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని గురునానక్‌ కాలనీలో ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యులు డాక్టర్‌ డి.శ్రీనివాస్‌ (40)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబంతోపాటు తల్లి కూడా ఆయన వద్దే ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఇంటికి వెళ్లిన పని మనిషికి బాల్కనీలో శ్రీనివాస్‌ ఉరి వేసుకుని ఉండడం కనిపించింది. ఆమె చూసి చుట్టుపక్కల వారికి చెప్పింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు లోపలకు వెళ్లి చూడగా శ్రీనివాస్‌ ఉరికి వేలాడుతూ కనిపించారు. ఆయన భార్య ఉష (38), కుమార్తె శైలజ (9), కుమారుడు శ్రీహాన్‌ (8), తల్లి రమణమ్మ (65) రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వారి గొంతుకలు కోసి ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల డాక్టర్‌ శ్రీనివాసే కుటుంబ సభ్యులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు?
డాక్టర్‌ శ్రీనివాస్‌ గుంటూరు మెడికల్‌ కళాశాలలో ఎంబిబిఎస్‌ పూర్తి చేశారు. అనంతరం సూపర్‌ స్పెషాలిటీ కోర్సును అభ్యసించారు. నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో కొన్నేళ్లు వైద్యులుగా సేవలందించారు. ఏడాది క్రితం సొంతంగా పుష్పా హోటల్‌ సెంటర్‌ సమీపంలో శ్రీజ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు.ఆస్పత్రి సరిగా నడవకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ఆ మొత్తాన్ని తీర్చాలంటూ రుణదాతలు ఒత్తిడి చేయడం ప్రార భించారు. దీంతో కొంత కాలంగా ఆయన డిప్రెషన్‌లో పడిపోయినట్లు చెబుతున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులను చంపి, తెల్లవారు జామున డాక్టర్‌ శ్రీనివాస్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ హెచ్‌డిఎఫ్‌ రామకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. డాక్టర్‌ శ్రీనివాస్‌ తన ఇంటి ఎదురుగా ఉన్న మరొకరి ఇంటి పోస్టు బాక్సులో ‘నా కారు తాళం నా అన్నకు ఇవ్వాలి’ అని రాసిన లెటర్‌ ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఇది ఆత్మహత్యకు ముందు రాసిన లెటర్‌గా భావిస్తున్నారు.