పండగ పూట విషాదం… చిన్నారిని కబళించిన కారు

నవతెలంగాణ విశాఖ: సంక్రాంతికి తాతయ్య ఇంటికొచ్చి ఆటపాటలతో సందడి చేస్తున్న చిన్నారిని ఓ కారు కబళించింది. ఈ ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. సీఐ కోటేశ్వరరావు కథనం ప్రకారం… పెందుర్తి సుజాతనగర్‌కు చెందిన బోగెర్ల నవీన్‌కుమార్, మృదుల దంపతులకు కుమార్తె లార్ని(5) ఉంది. వీరు సంక్రాంతిని సందర్భంగా.. పాతగాజువాక సెలెస్ట్‌ అపార్టుమెంట్‌లో ఉంటున్న బంధువులు లక్ష్మి, సూర్యారావుల ఇంటికి వచ్చారు.

బుధవారం ఉదయం సెల్లార్‌లో ఆడుకుంటానని బాలిక అడగడంతో తాతయ్య సూర్యారావు చిన్నారిని కిందకు తీసుకొచ్చారు. అదే అపార్టుమెంట్‌లో అద్దెకుంటూ ఫార్మాలో పనిచేస్తున్న రాజేశ్‌ ఆ సమయంలో కారులో సెల్లార్‌ నుంచి బయటకెళ్తున్నారు. అక్కడే ఆడుకుంటున్న లార్నీని ఆ కారు ఢీకొట్టింది. ముందు చక్రాల కింద నలిగి చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాజేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయిలో పనిచేస్తున్న నవీన్‌కుమార్‌ ఇటీవల లార్ని పుట్టినరోజు వేడుక కోసం స్వదేశం వచ్చి ఘనంగా నిర్వహించారు. ముద్దులొలికే కుమార్తె ప్రమాదంలో చనిపోవడం… ఆ అమ్మానాన్నలను శోకసంద్రంలో ముంచింది.