నవతెలంగాణ-సిటీబ్యూరో
శాలసిద్ధిపై నేటి నుంచి రెండో విడుత రాష్ట్రవ్యాప్త శిక్షణ కార్యక్రమాలను రాజేంద్రనగర్‌లోని టీఎస్‌ఐఆర్డీలో విద్యాశాఖ ప్రారంభించనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమాలకు 16 జిల్లాలకు చెందిన సమగ్ర శిక్షణ కో-ఆర్డినేటర్లుతో పాటు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు హాజరుకానున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి నలుగురు ఎస్‌ఎస్‌ఏ అధికారులతో పాటు ముగ్గురు ప్రధానోపాధ్యాయులు వెళ్లనున్నారని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇక జిల్లా స్థాయిలో రిసోర్స్ పర్సన్లకు, మండల స్థాయిలో అన్ని పాఠశాలల హెచ్‌ఎంలకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 24, 25, 26వ తేదీల్లో జరిగే శాలశుద్ధి రాష్ట్రవ్యాప్త శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల ప్రగతి, ఉపాధ్యాయుల పనితీరు, బోధన అభ్యసన ప్రక్రియ, విద్యార్ధుల నాయకత్వం వంటి అంశాలపై చర్చించనున్నారు.