నవతెలంగాణ-తాడ్వాయి : జాతరలో హఠాత్తుగా గుండెపోటుకు గురైన వ్యక్తికి ప్రథమ చికిత్స అందచేయడంపై మేడారం జాతరలో విధులు నిర్వహించే ఉద్యోగులందరికీ అవగాహన కల్పించేందుకు సోమవారం జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య, ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు కార్డియోపల్మనరీ రిససిటేషన్(సిపిఆర్) అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గుండెపోటుకు గురైన వ్యక్తికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందేలోగా జరిగే ప్రథమ చికిత్సనే సిపిఆర్ అంటారని, ఒక ప్రత్యేక పద్ధతిలో గుండె కండరాలపై ఒత్తిడి తీసుకురావడాన్ని సిపిఆర్‌గా పిలుస్తారని తెలిపారు. గుండెపోటుకు గురైన వ్యక్తులలో చాలామంది సకాలంలో వైద్య సహాయం అందని కారణంగా మరణిస్తున్నారని, రోగి ఆసుపత్రికి చేరేలోగా సిపిఆర్ చేయడం వల్ల ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడడం సాధ్యమవుతుందని వారు చెప్పారు. ఈ సి పి ఆర్ విధానం మేడారం మహా జాతరలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అందరి ప్రాణాలను కాపాడవచ్చు అని తెలిపారు. మేడారం మహా జాతరలో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి సిపిఆర్ గురించి అవగాహన తెలుసుకొని ఉండాలంటే తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఆఫీసర్స్ ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, వైద్యులు రణధీర్, చంద్రకాంత్, మధు, పవన్, గౌతమ్, రంజిత్, శ్రీకాంత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.