– 13,953 మంది కొత్త కానిస్టేబుళ్లకు …
– టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లకు త్వరలో నిర్వహిస్తాం :అదనపు డీజీ అభిలాష బిస్త్ వెల్లడి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో కొత్తగా నియమితులైన 13,953 మంది కానిస్టేబుళ్ల శిక్షణా కార్యక్రమం నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించి పోలీసు ట్రైనింగ్ కాలేజీలు, జిల్లా ట్రైనింగ్ కాలేజీలు, బెటాలియన్లలో రాష్ట్ర పోలీస్ ట్రైనింగ్ విభాగం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు అదనపు డీజీ అభిలాష బిస్త్ తెలిపారు. నియామకమైన టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లు 4,723 మంది మినహా మిగతా సివిల్, ఏఆర్, సీఏఆర్, ఐటీ, పీటీఓ లకు చెందిన 13,953 మంది కానిస్టేబుళ్లకు శిక్షణను తొలి విడతగా ప్రారంభిస్తున్నట్టు ఆమె తెలిపారు. వీరికి 9 నెలల పాటు వివిధ అంశాలలో ఇండక్షన్ ట్రైనింగ్ కోర్సు ఉంటుందని చెప్పారు. మహిళా కానిస్టేబుళ్లకు మేడ్చల్ ట్రైనింగ్ కాలేజీలో, సివిల్ కానిస్టేబుళ్లకు కరీంనగర్‌లో, ఏఆర్ కానిస్టేబుళ్లకు నల్గొండ, మంచిర్యాల బెటాలియన్స్‌లలో శిక్షణనిస్తున్నట్టు ఆమె తెలిపారు. మిగతా టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లకు త్వరలోనే ట్రైనింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని చెప్పారు. కాగా, తమకు శిక్షణను ఆలస్యం చేయటం వలన ఏడాది కాలం పాటు తమ సర్వీసును కోల్పోతామని టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా తమను ట్రైనింగ్‌కు పంపించాలని వారు కోరుతున్నారు.