– పని పరిస్థితులను మెరుగుపరచాలని కోరుతూ సమ్మెకు దిగిన యూనియన్లు
గ్రీస్ : మరింత మెరుగైన రీతిలో వర్క్ కాంట్రాక్టులు, షరతులు రూపొందించాలని కోరుతూ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్లు సమ్మెకు పిలుపివ్వడంతో ఇటలీ వ్యాప్తంగా శనివారం వందలాది విమానాలు రద్దయ్యాయి. విమానాశ్ర యాల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చిక్కుండిపోయారు. గత రెండు రోజులుగా రైలు సర్వీసులు స్తంభించిన నేపథ్యంలోనే ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్లు కూడా శనివారం సమ్మె చేయడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పైలట్లు, ఫ్లైట్ అటెండెంట్లు, బ్యాగేజీ హాండ్లర్లు, విమానాశ్రయ సిబ్బంది అందరూ సమ్మెలో పాల్గొన్నారు. ఉదయం 10గంటల నుండి డజన్ల సంఖ్యలో విమానాలు రద్దు చేసినట్లు నాప్లేస్ ఎయిర్‌పోర్ట్ వెబ్‌సైట్ చూపింది. మరోవైపు రైల్వే యూనియన్లు కూడా గురు, శుక్రవారాల్లో రెండు రోజులు సమ్మె నిర్వహించాయి. సిబ్బంది కొరత, అధిక సమయాలు పనిచేయాల్సి రావడం, తక్కువ వేతనాలు, ఇతర పేలవమైన పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ దేశంలోని ప్రధాన రైల్వే యూనియన్లు రెండు రోజుల సమ్మెకు పిలుపిచ్చాయి. దాంతో రైళ్ళు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇటలీలో పర్యాటకులు అత్యధికంగా వచ్చే సమయం ఇది. ఈ పరిస్థితుల్లో రవాణా రంగం స్తంభించడంతో తీవ్ర తలనొప్పిగా మారింది.