ట్రంప: ట్రంపస్య.. ట్రంపోభ్య:

Trump: Te mau rave'a.. Te mau rave'a:ట్రంపు భలే ఇంపు అన్నాడొక మిత్రుడు. వెంటనే, కాదు కాదు ట్రంపు ఓ కంపు అన్నది ఓ స్నేహితురాలు. కానే కాదు ట్రంపు మాట వినసొంపు అన్నాడో పెద్దమనిషి.. లేదు లేదు ట్రంపు ఏమంత ఇంపైన పదం కాదని మరో పండితురాలు అన్నది. ఈ డైలాగులన్నీ పక్కనే ఉన్నా మాట్లాడుకునేవాళ్లకు తెలియకుండా వింటోంది పిపీలకం అనే మాడ్రన్‌ చీమ. సహజంగానే దానికి ఎన్నో అనుమానా లొచ్చాయి. రావిశాస్త్రి గారి కథలోలాగ తానూ బయలుదేరి మాంచి తెలివి గలవారిని కలిసి ఇంతకీ ఈ ట్రంపు నిజంగా ఇంపు, కంపు, సొంపునా లేక ఇవేవీ కాని మరో మనిషా అని తెలుసుకోడానికి అక్కడినుండి జనంపై, ప్రపంచంపై పడింది చీమ.
మొదట దువ్వాడ జగన్నాథం సినిమా డైలాగులు రాసినతని దగ్గరికి పోయింది పిపీలకం. ఆయన వెంటనే తన డైలాగు ట్రంప: ట్రంపస్య ట్రంపోభ్య:… అన్నాడు. ఈ పదాలకు అర్థమేమిటన్నది పిపీలకం. నేను బిజీగా ఉన్నాను మళ్లీ రమ్మన్నాడాయన. డ్రీం రియలిజంలో లాగ కలనో, నిజమో తెలియకుండానే చీమ తనకిష్టమైన వాళ్లదగ్గరికి అలవోకగా పోతోంది. అలా ఇంగ్లీషు రచయిత, నాటకకర్త షేక్స్పియర్‌ దగ్గరికి పోయింది. ట్రంపు గురించి అడిగింది, మీకేమైనా తెలిస్తే చెప్పమంది. ఆయనొక్కటే మాట చెప్పాడు. ట్రంపు మిత్రులెవరో చెప్పు నేను ట్రంపు గురించి చెబుతాను అన్నాడు. ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరై వచ్చిన వాళ్లెవరో ముందు కనుక్కో అన్నాడు. చీమ వెంటనే ట్రంపు మిత్రులెవరు అని కనుక్కోవడానికి బయలుదేరింది. ఆయన మిత్రుల్ని వరుసగా కలుస్తోంది. ఒక మిత్రుడేమో ట్రంపంటే అమెరికా ప్రెసిడెంటు అంటే ప్రపంచంలో బాగా ప్రాచుర్యమున్న, బలవంతుడైన వ్యక్తి అన్నాడు.
ప్రపంచంలో బలవంతుడైన వ్యక్తి ఎలాగవుతాడు? ఒక్క బాక్సింగు క్రీడాకరిణిని లేదా క్రీడాకారుణ్ణి కొట్టగలడా అని ఆరా తీసింది.కొట్టలేడని చెప్పారు చాలామంది. మరి ప్రపంచంలో అందరికంటే ఎలా బలవంతుడవుతాడు అమెరికా ప్రెసిడెంటు, అది ట్రంపు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అనేసరికి అసలు అమెరికా అధ్యక్షుడంటే ప్రపంచ పోలీసు నీకేం తెలుసు?అని ఇంకొకరన్నారు. మరి మామూలు సూటు బూటు వేసుకున్నాడు కదా పోలీసెలా అవుతాడు వాళ్ల యూనిఫాం కూడా వేసుకోలేదు కదా అంది పిపీలకం. ఓసి పిచ్చి పిపీలకమా అదంతే! ప్రపంచ పోలీసు అలాగే ఉంటాడు మరి. చేతిలో లాఠీ పెట్టుకొని ఉంటాడా ఏమన్నా? అవసరమొచ్చినప్పుడు తన లాఠీ లాంటి ఆధిపత్యం చూపిస్తాడు అదే అందులో ఉన్న తమాషా అన్నారింకొకరు.
అసలు ఈ రాష్ట్రంలో, ఈదేశంలో కాదు నేను సీదా అమెరికాకే పోయి ట్రంపుగారి ఆఫీసులో ఏమేమి జరుగుతాయో చూసిరావడం మేలు అనుకొని పిపీలకం రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టుకు బయలుదేరింది. ఎటువంటి పాసుపోర్టు, వీసా కనీసం టికెట్టు కూడా లేకుండానే విమానమెక్కేసింది. విమానంలో పోతున్న భారతీయులు అక్కడ పౌరసత్వం ఉన్నోళ్లు, ఇప్పుడు తీసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నవాళ్లు మాట్లాడుకునే మాటలు మన పిపీలకం గారి చెవిలో పడ్డాయి. తన దేశ పౌరల క్షేమమే తనకు ముఖ్యం అని ట్రంపు మాటలున్న వీడియో చూస్తున్నాడు ఒక యువకుడు. పక్కనే ఇంకో యువతి, ఇద్దరూ భార్యాభర్తలు అక్కడ ఒకరికి ఉద్యోగముంది ఇంకొకరికి ప్రయత్నం చేద్దామని పోతున్నారు. తెలుగులో మాట్లాడుతుండడం విని పిపీలకానికి ఆశ్చర్యమేసింది, అరే వీళ్ళు తెలుగోళ్ళు కదా ఇంగ్లీషులో కదా మాట్లాడాల్సింది అనుకుంది కూడా. పక్కనోళ్లకు వినబడకుండా అలా తెలుగులో మాట్లాడుతున్నారని తరువాత అర్థమయింది. ఇప్పుడు ట్రంపు చేస్తున్న పనులకు, మాట్లాడుతున్న మాటలకు ఎక్కువగా భయపడు తున్నది భారతీయులే అని అర్థమయింది. ఇంతలో దానికి ఆకలిగా అనిపించింది. విమానంలో పిల్లలు తింటూ పడేసిన కేకుపొడి, ఇంకా అలాంటివే దొరికితే తిని పడుకుంది పిపీలకం. వాషింగ్టన్‌ వచ్చిందని అందరూ దిగిపోతున్నారు.
మెల్లగా అందరూ దిగిపోయినాక తానూ దిగింది పిపీలకం. తననెవరైనా చూస్తున్నారేమోనని మొదట అనుమానపడింది. ఎవరిపనుల్లో వాళ్లున్నారు. అక్కడి చీమలు కూడా తనని చూసినట్టు అనిపించింది కాని అవి పెద్దగా పట్టించుకోలేదు. ట్రంపు పాలనలో తమకేమైనా మేలు జరుగుతుందని అనుకుంటున్నారా అని వాటిని అడిగింది పిపీలకం వచ్చీరాని ఇంగ్లీషులో. ఎవరొస్తే ఏమన్నట్టు మాట్లాడాయి అవికూడా. సరేననుకుని మెల్లగా ప్రెసిడెంటు ఉండే స్వేతసౌధం వైపు పోయింది. అక్కడ చీమలతో ఇంటర్వ్యూ చేసి కొన్ని వివరాలు రాబట్టింది. విలేకరులతో ట్రంపుగారు ఏర్పాటు చేసిన ఇష్టాగోష్టి అది. అందరికీ వాళ్ళ టిఫిన్లు ఇచ్చారు. వాళ్లు తినేలోపు వైట్‌హవుస్‌ వంటశాలలో తనకు నచ్చినవి తినొచ్చింది పిపీలకం. విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలిస్తున్నాడు ట్రంపు. ఈదేశంలో పుట్టినంత మాత్రాన ఇక్కడి పౌరసత్వం రాదని ఖరాకండిగా చెబుతున్నాడు. అలా చేస్తే మన దేశానికి నష్టం కదా అన్న ఒక ప్రశ్నకు ముందు నాదేశ పౌరుల్ని కాపాడుకోవడం నా విధి అంటున్నాడు. ఫలానా తేదీ తరువాత పుట్టేటోళ్లకు పౌరసత్వం రాదంటున్నాడు. మొదట సరైన పత్రాల్లేని ఐదువందల విదేశీ పౌరుల్ని వాళ్ల వాళ్ల దేశాలకు పంపేశానన్నాడు. ఇలా చేస్తే వాళ్లు చేసే పనులు అంత తక్కువ జీతాలకు ఇతరులు చేయరు కదా అని ఒక విలేకరి అడిగాడు. నువ్వు బైడెన్‌ మనిషివా? అన్నాడు ట్రంపు. ఆ నోటి కంపు భరించలేక ఊరకున్నాడు ఆ విలేకరి. దానికీ మార్గం చూపు తానన్నాడు. ఆ సమావేశం తరువాత పెద్ద పెద్ద కంపెనీల సీయీవోలతో సమావేశమయ్యాడు అధ్యక్షుడు. అక్కడికీ పోయింది మన పిపీలకం. అక్కడ వాళ్లూ నిర్దేశించినవి తన సహాయకుడు అన్నీ రాసుకుంటున్నాడు. త్వరలో ఇవన్నీ చేస్తానని చెబుతున్నాడు వాళ్లకి. అమెరికాలో కొన్ని రాష్ట్రాలకు కూడా పోయింది పిపీలకం. అన్నిదేశాల వాళ్ల ఇండ్లకూ పిలవని పేరంటంలా పోయి అక్కడక్కడ కొన్ని విషయాలు కనుక్కుంది. అయినా తృప్తి కలుగలేదు దానికి.
ఓరోజు ట్యాంకుబండు దగ్గర ఓ పెద్దాయన కూచొని ఉన్నాడు. ఆయన్నడిగితే ఏమైనా తెలుస్తుందేమోనని మెల్లగా కదిలించింది. నువ్వు రావి శాస్త్రి పిపీలకానివా అన్నాడాయన. నేను కొత్త తరం పిపీలకాన్ని, ఐనా నాకూ కొన్ని అనుమానాలున్నాయి అని అమెరికా అధ్యక్షుడి గురించిన విషయం అడిగింది. చూడూ సీదా ఉస్మానియా యూనివర్సిటీకి పో. అక్కడ అపర్ణ అనే విద్యార్ధిని అమెరికా అధ్యక్షులపై పరిశోధన చేస్తోంది.ఆమెనే తీరుస్తుంది నీ అనుమానాలు అన్నాడు. సరేనని అపర్ణను కలిసింది పిపీలకం. తనకున్న అనుమానాలన్నీ అడిగింది. ఇంతలేవు నీవు అనుకోకుండా పిపీలకం గారూ అని మొదలు పెట్టింది అపర్ణ.
సూటు బూట్లు, మంచి తిండి, వైట్‌ హవుస్‌ నివాసం, మంచి గుర్తింపు, ప్రథమ పౌరుడు భార్యకు ప్రథమ పౌరురాలు, చార్టరుడు విమానాలు, మంచి కార్లు ఇలా అన్నీ ఉంటాయి అధ్యక్షుల వారికి. పెద్ద బుష్షును ఒకరు ఎదిరిస్తే చిన్న బుష్షు తరువాత చంపుతాడు. ఏ అధ్యక్షుడైనా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా రీగన్‌ కాదు, ఒబామా కాదు ఇంకెవరైనా తమ దేశంలో ఉన్న పెట్టుబడిదారులే ఆ దేశాన్ని, తద్వారా ప్రపంచాన్ని కంట్రోలు చేసేది. అంతెందుకు ఏయే అధ్యక్షుడు ఉండంగా ఏయే యుద్ధాలు చేశాడు, చేయించాడు లేకుంటే ఆయుధాలందించాడు? ఒక్క అధ్యక్షుడైనా ఒక యుద్ధాన్ని ఆపాడా? ఇప్పుడు జరుగుతున్న హమాస్‌-ఇజ్రాయిల్‌ యుద్ధమే తీసుకో అధ్యక్షుడు ఏవైపున్నాడు. ఇప్పుడు కొత్త ప్రెసిడెంటు వచ్చాడు కదా అంతకుముందాయన మొదలుపెట్టిన వాటిని ఆపుతాడా? కాబట్టి పిపీలకం గారూ, తోలుబొమ్మలాట చూశారా అలాగే ఈ అధ్యక్షుడి ఆట ఆడించేది వేరే వాళ్లు. ముందు అది తెలుసుకోండి.
పిపీలకానికి మనసు తేలికపడిందిప్పుడు. హాయిగా తన చిన్ని చిన్ని ఊపిరితిత్తులతో గాలి తీసుకుంది. అమెరికా అధ్యక్షుడంటే ఓ మిలిటరీ ఉద్యోగం అనుకుంటూ ఇంటికి పోయింది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారు వాళ్లకు విషయాలు చెప్పాలని కూడా అనుకుంది.