– రేపు వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క
– ట్రాన్స్‌జెండర్లకు అందుబాటులోకి ఔట్‌పేషెంట్, డయాగస్టిక్ సేవలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో ట్రాన్స్ క్లినిక్‌ల ఏర్పాటు పూర్తయింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆ క్లినిక్‌లు నడువనున్నాయి. వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) ఈ నెల రెండో తేదీన వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. అప్పటి నుంచి జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో ట్రాన్స్‌జెండర్ ఔట్‌పేషెంట్లకు వైద్యసేవలు, డయాగస్టిక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. సాధారణంగా ట్రాన్స్‌జెండర్లు అంటేనే సమాజంలో ఒక వివక్ష, చిన్న చూపు ఉన్నది. సాధారణ పౌరుల మాదిరిగా ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందలేని పరిస్థితి. వారు తమ ఆస్పత్రులకు వస్తే సాధారణ రోగులు రారనే భయంతో కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు చికిత్సకు నిరాకరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. వివక్ష, చిన్నచూపు కారణంగా జనరల్ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకోవడానికి కూడా ట్రాన్స్‌జెండర్లు వెనకాడుతున్నారు. వారు వైద్యం విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ట్రాన్స్‌జెండర్ల సంఘాల, పలు ఎన్జీఓ సంస్థలకు చెందిన వారు ప్రత్యేకంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే 33 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా ట్రాన్స్ క్లినిక్‌ను ఏర్పాటు చేయించింది. తమకు ప్రత్యేక వైద్య క్లినిక్‌లు ఏర్పాటు చేయించడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి సీతక్కకు, సీఎం రేవంత్‌రెడ్డికి ట్రాన్స్‌జెండర్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు.