అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ బదిలీ

– ఆ స్థానంలో ఇంకా ఎవరినీ నియమించని ప్రభుత్వం 

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) హేమంత్ కేశవ్ పాటిల్ బదిలీ అయ్యారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న హేమంత్ కేశవ్ పాటిల్ ను హైదరాబాద్ కు  అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) గా బదిలీ చేసింది. సూర్యాపేట జిల్లాలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా విధులు నిర్వహిస్తూ అదే హోదాలో  గత ఆగస్టు 2023న నల్లగొండకు హేమంత్ కేశవ్ పాటిల్  బదిలీపై వచ్చారు. అప్పటినుండి నల్లగొండ జిల్లాలో  అదనపు  కలెక్టర్ గా  విధులు నిర్వహిస్తూ పాలనలో తనదైన ముద్ర వేశారు. కాగా అదనపు కలెక్టర్ ను  బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లా కు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా ఇంకా ఎవరిని నియమించలేదు.
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భద్రాచలంకు బదిలీ: నల్లగొండ జిల్లా ఆర్అండ్ఆర్ ఎల్ ఏ యూనిట్ 2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కొల్లు దామోదర్ రావు ను రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం ఆర్డీవోగా బదిలీ చేసింది. ఆ  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థానంలో ప్రస్తుతం అచ్చంపేట ఆర్డీవో గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దరువు సుబ్రహ్మణ్యం ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.