– మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ, విపత్తు స్పందనపై జీహెచ్‌ఎంసీకున్న కొన్ని అధికారాలకు బదలాయింపు అవసరమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శనివారం శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు జీహెచ్‌ఎంసీ (సవరణ) బిల్లు, 2024, ది తెలంగాణ మున్సిపాల్టీస్ (సవరణ) బిల్లు, 2024ను ప్రవేశపెట్టగా, మరో మంత్రి పొన్నం ప్రభాకర్ ది తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) బిల్లు, 2024ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కమిషనర్‌కు ఉన్న అధికారాలను ఇతరులకు అప్పగించనున్నట్టు తెలిపారు. ఒఆర్‌ఆర్‌లోపు దీని పరిధి ఉంటుందని చెప్పారు. మున్సిపల్ చట్ట సవరణ ద్వారా జీహెచ్‌ఎంసీలోకి 59 ఒఆర్‌ఆర్ లోపల ఉన్న గ్రామాలను విలీనం చేస్తున్నట్టు చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని గ్రామ పంచాయతీలను తీసుకొస్తున్నట్టు చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
సవరణ బిల్లులపై చర్చలో పాల్గొంటూ శాసనమండలిలో బీఆర్‌ఎస్ పక్షనేత మధుసూదనాచారి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాజ్యాధికారంలో దక్కాల్సిన వాటా ఇంకా దక్కలేదని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు బ్రహ్మాండమైన బీసీ డిక్లరేషన్ ను ప్రకటించిందని గుర్తుచేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కు అత్యంత ప్రాధాన్యత ఉందని తెలిపారు. అయితే సవరణ బిల్లులో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా అని పేర్కొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపాల్టీల్లో విలీన గ్రామాల పరిస్థితి అటు గ్రామపంచాయతీకి కాకుండా, ఇటు మున్సిపాల్టీకి కాకుండా అన్నట్టుగా తయారయ్యాయని విమర్శించారు.
బీఆర్‌ఎస్ సభ్యురాలు సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ నర్సంపేట రాజుపేట, రాములు నాయక్ తండా మున్సిపాల్టీలోకి వస్తే ఐదో షెడ్యూల్ లో ఉన్న బెనిఫిట్స్ కొనసాగుతాయా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ సభ్యులు శంభీపూర్ రాజు మాట్లాడుతూ, అన్ని అనుమతులు తీసుకుని, బ్యాంకు లోన్లతో నిర్మాణమైన ఇండ్లను కూల్చివేశారనీ, ఆ ఇండ్లకు తీసుకున్న బ్యాంకు రుణాలను ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, సబర్మతీ ప్రాజెక్టు నిర్వాసితులకు ఒక్క ఇల్లు నిర్మించి ఇవ్వలేదని తెలిపారు. హైడ్రాకు చట్టబద్ధత ఉందనీ, దీనిపై ప్రజలకు ఇంకా అవగాహన కల్పించాల్సిందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ప్రజలకు భద్రమైన భవిష్యత్తును అందించేందుకే హైడ్రా ఏర్పాటు అని తెలిపారు. బీఆర్‌ఎస్ సభ్యులు తాత్షా మధు మాట్లాడుతూ ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) లోపల నిర్మాణాలు చేపట్టిన ప్రజా ప్రతినిధులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇప్పటికీ మూసీలో ఆక్రమించి నిర్మిస్తున్నారని చెప్పారు. సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ మున్సిపాల్టీలో విలీన గ్రామాల ప్రజలు ఉపాధి హామీ కోల్పోతున్నారనీ, వారికి పట్టణాల్లో ఉపాధి కల్పించాలని సూచించారు. బీఆర్‌ఎస్ సభ్యులు వీలీన గ్రామ పంచాయతీలకు నిధులిచ్చేలా నిబంధంనలు పాటించాలని కోరారు. కాంగ్రెస్ సభ్యులు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, పేదలకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవమేననీ, అయితే అలాంటి నిర్మాణాలకు అనుమతులిచ్చిందెవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యులు టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులు, కుంట లను పరిరక్షించడం ప్రధాన బాధ్యతగా తీసుకుందని అభినందించారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను తగ్గించిందని విమర్శిచారు. బీఆర్‌ఎస్ సభ్యులు బండా ప్రకాశ్ మాట్లాడుతూ రెవెన్యూశాఖకు ఉమ్మడి ఆస్తులను కాపాడే బాధ్యత ఉందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వానికి ఎవరు అడ్డంగా ఉన్నారని ప్రశ్నించారు.సభ్యులు భానుప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కాంగ్రెస్ సభ్యులు తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఎవరి జనాభా ఎంతో వారికంత వాటా అన్నది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ సభ్యురాలు వాణిదేవి మాట్లాడుతూ విలీన గ్రామాల కొత్త సమస్యలు రాకుండా చూడాలని సూచించారు.