— మంత్రి సబితకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మల్టీజోన్-2 పరిధిలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి బుధవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలను పూర్తి చేశారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా క్యాడర్ స్ట్రెంత్ విషయంలో కొందరు ఉపాధ్యాయులు హైకోర్టుకు వెళ్లారని పేర్కొన్నారు. మల్టీజోన్-2 పరిధిలోని పదోన్నతులు, బదిలీలు నిలిపేశారని తెలిపారు. మల్టీజోన్-1 పరిధిలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు పూర్తి చేశారని పేర్కొన్నారు. స్కూల్ అసిస్టెంట్, తత్సమాన పోస్టుల బదిలీలకు ఆప్షన్లు ఇవ్వాలంటూ షెడ్యూల్ జారీ చేశారని వివరించారు. దీంతో మల్టీజోన్-2 పరిధిలోని ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. విద్యామంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని మల్టీజోన్-2 పరిధిలోని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు, స్కూల్ అసిస్టెంట్, తత్సమాన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, ఎస్జీటీ, తత్సమాన ఉపాధ్యాయుల బదిలీలను పూర్తి చేయాలని కోరారు. మల్టీజోన్-2 ఉపాధ్యాయులు పదోన్నతుల సందర్భంగా నష్టపోకుండా చూడాలని తెలిపారు. మల్టీజోన్-1 ఉపాధ్యాయుల పదోన్నతుల తేదీ నుంచే మల్టీజోన్-2 ఉపాధ్యాయులకు పదోన్నతుల పోస్టులో సర్వీసు లెక్కించుటకు రెట్రాస్పెక్టివ్‌గా పదోన్నతులను వర్తింపచేయాలని సూచించారు.