– ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడల్ సూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లను వెంటనే చేపట్టాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం శాసన మండలిలో ప్రత్యేక ప్రస్తావన సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్రంలోని 194 మోడల్ సూళ్లలో గత 11ఏండ్లుగా బదిలీలు, పదోన్నతులు కల్పించలేదని గుర్తు చేశారు. ఈ క్రమంలో 25 మంది ఉపాథ్యాయులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన టీచర్ల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు, ఉద్యోగాలు కల్పించాలని కోరారు. అలాగే ప్రాథమిక, జెడ్పీ, తదితర పాఠశాలల ఉపాధ్యాయుల మాదిరిగానే రాష్ట్రంలోని ఆశ్రమ గురుకులాల్లో పని చేస్తున్న పీఈటీలు, పండిట్లకు వెంటనే పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి సైతం ప్రస్తావించారు. వెంటనే బదిలీలు, పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వాణీ దేవీ కోరారు. సమస్యలను నోట్ చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
పెద్దవాగుతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించండి :యాదవరెడ్డి
ఖమ్మం జిల్లాలో పెద్దవాగు తెగడం వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని ఎమ్మెల్సీ యాదవరెడ్డి కోరారు. ప్రకృతి విధ్వంసం వల్ల 40 ఎకరాల్లో ఇసుక మేటలు పేరుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ కింద 80 శాతం ఏపీ, 20 శాతం తెలంగాణ ఆయకట్టు సాగవు తున్నదనీ, వెంటనే ఏపీతో మాట్లాడి ప్రాజెక్ట్‌ను పునరుద్ధరించాలని కోరారు.
ఉస్మానియా ఆస్పత్రిని ఎప్పుడు నిర్మిస్తారు : ఎంఎస్ ప్రభాకర్
ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఉస్మానియా ఆస్పత్రి శిథిలావస్థకు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పలు మార్లు పెచ్చులు ఊడిపోవడంతో రోగులు అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. ఈ ఆస్పత్రి కొత్త భవనాన్ని ఎప్పుడు నిర్మిస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
98 మంది డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయండి : తీన్మార్ మల్లన్న
తెలంగాణ ప్రభుత్వం 98 మంది డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వీరిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాజీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎనిమిది నెలల పెండింగ్ గౌరవ వేతనం చెల్లించాలనీ, ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.