రాష్ట్రంలో 9 మంది ఐపీఎస్‌ల బదిలీలు

– ఐదుగురు నాన్‌కేడర్‌ ఎస్పీలకూ స్థానచలనం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం 14 మంది పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఇందులో కొందరు నాన్‌కేడర్‌ ఎస్పీలు కూడా ఉన్నారు. కాగా, మరికొందరు అధికారులను బదిలీ చేసి వారిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. బదిలీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నగర ఎస్బీ అదనపు కమిషనర్‌ పి. విశ్వప్రసాద్‌ను నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గా, పోస్టింగ్‌ కోసం ఎదరు చూస్తున్న డీఐజీ ఎ.వి రంగనాథ్‌ను నగర జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ (క్రైమ్స్‌ అండ్‌ సిట్‌)గా నియమించి.. ఈ స్థానంలో ఉన్న డాక్టర్‌. గజరావ్‌ భూపాల్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. ఇంటెలిజెన్స్‌ ఎస్పీ ఎస్‌.ఎం. విజరు కుమార్‌ను నగర పశ్చిమ మండలం డీసీపీగా బదిలీ చేసి.. ఆ స్థానంలో ఉన్న డీసీపీ జోయెల్‌ డేవిస్‌ను నగర స్పెషల్‌ బ్రాంచ్‌ డీసీపీగా మార్చారు. మెదక్‌ ఎస్పీ రోహిణి ప్రియదర్శినిని నగర ఉత్తర మండలం డీసీపీగా నియమించి.. ఈ స్థానంలో ఉన్న డీసీపీ జి.చందన దీప్తీని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలన్నారు. సిద్దిపేట్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేతను నగర డి.డి డీసీపీగా, పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న మరో ఎస్పీ ఎల్‌.సుబ్బారాయుడును నగర ట్రాఫిక్‌ డీసీపీ-1గా నియమించారు. నగర టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ నితికా పంత్‌ను బదిలీ చేసి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలన్నారు. ఇక నాన్‌కేడర్‌ ఎస్పీలలో పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న ఎన్‌.వెంకటేశ్వర్లును నగర ట్రాఫిక్‌ డీసీపీ-3గా నియమించి, ఇక్కడున్న డీసీపీ డి.శ్రీనివాస్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్‌లో రోడ్‌ సేఫ్టీ డీసీపీగా ఉన్న శ్రీ బాలా దేవిని నగర టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా, మాదాపూర్‌ డీసీపీ జి.సందీప్‌ను సికింద్రాబాద్‌ రైల్వేస్‌ (అడ్మిన్‌) ఎస్పీగా నియమించి.. ఇక్కడున్న జె.రాఘవేందర్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.