పరివర్తన

Transformationకొమరబండ అనే పాఠశాలలో లక్ష్మి, గాయత్రి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ఏడవ తరగతి చదువుతున్నారు.
ఒకరోజు పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చెట్టు కింద వద్ధురాలు కూర్చుని ”అమ్మా! నాకు ఆకలిగా ఉంది. ఏమన్నా ఉంటే పెట్టండి” అని అడిగింది. అప్పుడు లక్ష్మి తన దగ్గరున్న బిస్కెట్‌ ప్యాకెట్‌ను ఇచ్చింది. ”చల్లగా ఉండు తల్లి” అని దీవించింది ఆ వద్ధురాలు. ”ఎందుకు ఆమెకు బిస్కెట్‌ ప్యాకెట్‌ ఇచ్చావు” అన్నది గాయత్రి. ”ఏం కాదులే..అవ్వకు వయసు అయిపోయింది కదా? తను ఏ పనీ చేసుకోలేదు. అందుకే ఇచ్చాను. నా దగ్గర ఇంకో బిస్కెట్‌ ప్యాకెట్‌ ఉంది” అని బ్యాగులో నుండి బిస్కెట్‌ ప్యాకెట్‌ను బయటకు తీసింది. ఇద్దరు కలిసి బిస్కెట్స్‌ తినుకుంటూ పాఠశాలకు వెళ్లారు.
పాఠశాలకు వెళ్ళగానే దుర్గ అనే అమ్మాయి పరుగెత్తుకుంటూ వచ్చి ”గాయత్రి.. గాయత్రి.. నా దగ్గర పెన్నులు అయిపోయాయి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా? ఒక పది రూపాయలు ఇవ్వవా? నీకు రేపు ఇస్తాను” అన్నది. ”నేను ఇవ్వను” అని కసిరించింది గాయత్రి. ముఖం మాడ్చుకొని అక్కడి నుండి నిరాశగా వెళ్ళింది. అక్కడే ఉన్న లక్ష్మీ.. దుర్గను పిలిచింది. ”ఇదిగో పది రూపాయలు. తీసుకో. పెన్నులు కొనుక్కో” అని పది రూపాయల నోటును తీసి దుర్గకు ఇచ్చింది లక్ష్మి. ”థాంక్యూ లక్ష్మి” అని సంతోషంగా వెళ్లి పెన్నులు కొనుక్కుంది దుర్గ.
ఆ పాఠశాలలో విద్యార్థులంతా లక్ష్మీ చుట్టే తిరిగేవారు. లక్ష్మీ మంచి తనం చూసి ఆమెని అందరూ ఇష్టపడేవారు.
ఒకరోజు గాయత్రి ”లక్ష్మి.. ఎందుకు నువ్వంటే అందరికీ ఇష్టం. ఎందుకు నీతోనే అందరూ తిరుగుతారు” అని అడిగింది. లక్ష్మీ చిరునవ్వు నవ్వి ”నేను ఒక పని చెప్తాను. చేస్తావా?” అన్నది. గాయత్రి ”సరే చెప్పు చేస్తాను” అన్నది. చెట్టు కింద వద్ధురాలు ఉంది కదా? నీ దగ్గర లంచ్‌ బాక్స్‌లో కొంచెం అన్నం తీసి పెట్టు” అని చెప్పింది లక్ష్మీ. ”సరే” అని వెళ్ళి కొంచెం అన్నాన్ని తీసి పెట్టింది. వద్ధురాలు సంతోషపడి ”చల్లగా ఉండు” అని దీవించింది. మరుసటి రోజు తన ఫ్రెండ్స్‌ వచ్చి ఏదో వస్తువులు కొనుక్కుంటాను అనగానే పక్కనే ఉన్న లక్ష్మీ ”నీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వు” అని గాయత్రికి చెప్పింది. వెంటనే గాయత్రి డబ్బులను ఇచ్చింది. అలా అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టింది గాయత్రి. మెల్లమెల్లగా గాయత్రిని కూడా అందరూ ఇష్టపడసాగారు. ”చూసావా.. గాయత్రి ఇప్పుడు అందరూ నీ చుట్టూనే తిరుగుతున్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే ఆ సాయమే మనకు మిత్రుల్ని సంపాదించి పెడుతుంది. ఎప్పుడూ ఇలాగే సాయం చేస్తూ ఉండాలి” అని చెప్పింది లక్ష్మి. అప్పటినుండి అందరికీ సాయం చేయడం మొదలుపెట్టింది గాయత్రి. గాయత్రిలో మార్పు వచ్చినందుకు లక్ష్మి సంతోషించింది.
– మద్దినాల సువర్ణ, 7వ తరగతి,
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కోదాడ, సూర్యపేట