– సీఎం రేవంత్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లను నియమించటంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి… అధికారులను ఆదేశించారు. గురువారం ఇదే అంశంపై ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపిన సీఎం…గతంలో నిర్ణయించిన మేరకు తొలిదశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారిని నియమించాలని సూచించారు. సిగల్ జంపింగ్‌తోపాటు ఇతర నిబంధనలను ఉల్లంఘించే వారిని నిరోధించేందుకు వీలుగా హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్ల సేవలను వినియోగించుకోవాలని సీఎం కోరారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లోనూ వీరి సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు. తద్వారా తాగి వాహనాలను నడిపే వారి సంఖ్యను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. అందుకుగాను వారికి హోం గార్డుల తరహాలోనే జీతభ్యతాలను ఇచ్చేలా విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. ఆయా పనుల్లో ట్రాన్స్‌జెండర్లను వినియోగించే క్రమంలో వారికి ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను రూపొందించాలని అన్నారు. వీలైనంత త్వరగా, ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్ ఆవిష్కరణ
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (సాట్స్) ఆధ్వర్యంలో ఈనెల 18న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించతలపెట్టిన ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ ఆవిష్కరించారు. ఇండియా, మలేషియా జట్ల మధ్య ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, శ్రీనివాసరాజు, సాట్స్ చైర్మెన్ శివసేనారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.