పారదర్శకత…తటస్థత ఎండమావులేనా?

Transparency...Is neutrality a mirage?– ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతపై నీలినీడలు
– మితిమీరుతున్న పాలకుల జోక్యం
– మన్మోహన్‌ నుండి మోడీ వరకూ అదే తీరు
న్యూఢిల్లీ : భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీ) స్వతంత్రత, పారదర్శకత రోజురోజుకూ మసకబారుతోంది. ఈసీ వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం పెరిగిపోతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర అధికారుల నియామక ప్రక్రియ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించడం, ఈ వ్యవహారాన్ని పాలకులు పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవడం దేనికి సంకేతం?. ఎన్నికల సంఘంలోని వారు తమ అడుగులకు మడుగులొత్తాలని కేంద్రంలోని పెద్దలు కోరుకుంటారు. వాస్తవానికి ఎన్నికల కమిషన్‌ అనేది పూర్తి స్వతంత్ర సంస్థ. అయితే కొద్ది మంది మినహా మిగిలిన ఎన్నికల అధికారులందరూ పాలకుల తాబేదారులుగా వ్యవహరిస్తూ ఈసీ స్వతంత్రతను నీరుకారుస్తున్నారు.
రాజ్యాంగం ఇచ్చిన బహుమతి
ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి ప్రధాని ఇష్టానికి అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. అదే వ్యక్తి ఎన్నికల అధికారిగా నియమితుడైతే సర్వ స్వతంత్రుడు. తటస్థుడు. ప్రధాని ఇష్టాఇష్టాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. తనను కలవాల్సిందిగా ప్రధాని ఆయనను పిలవకూడదు. ఎన్నికల కమిషనర్‌ను ప్రధాని నియమించవచ్చు. కానీ ఆదేశాలు జారీ చేయకూడదు. ఆయనను తొలగించకూడదు. స్వతంత్ర ఎన్నికల కమిషన్‌ అనేది దేశానికి రాజ్యాంగం ఇచ్చిన బహుమతి. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా నిర్వహించడం దాని విధి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం అనేక సందర్భాలలో నొక్కి చెప్పింది. కానీ నేడు జరుగుతున్నదేమిటి?
రాజ్యాంగ ఉల్లంఘనే…
2021 డిసెంబర్‌లో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శితో సమావేశం కావాలంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు, మిగిలిన ఇద్దరు కమిషనర్లకు ప్రధాని కార్యాలయం (పీఎంఓ) కబురు పెట్టింది. ఇది కచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనే. విషయం ఎంత అత్యవసరమైనది అయినా, ఎంత ముఖ్యమైనది అయినా ఇలా పిలవడం తప్పు. గతంలోకి వెళితే…2006 జూన్‌లో ఖురేషీకి అప్పటి ప్రధాని ముఖ్య కార్యదర్శి పులోక్‌ ఛటర్జీ ఫోన్‌ చేశారు.
ఖురేషీని ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వం భావిస్తోందని, అయితే ఐఏఎస్‌కు ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుందని దాని సారాంశం. ఈ షరతు ఎందుకు విధించారో ఖురేషీకి అర్థం కాలేదు. ఎన్నికల కమిషన్‌ను ప్రభుత్వానికి, పాలకులకు దూరంగా ఉంచాలన్న రాజ్యాంగ నిబంధనను ఇది ఉల్లంఘించడం కాదా? ఆ తర్వాత ఖురేషీ ఎన్నికల కమిషనర్‌గా నియమితులు కావడం, ఆయనకు, ప్రధానికి మధ్య అడ్డుగోడలు ఏర్పడడం వేరే విషయం.
సీజేను పిలవగలరా?
సీఈసీని, ఇతర ఎన్నికల కమిషనర్లను ప్రధాని పిలవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ఇది ఆమోదయోగ్యం కాని చర్య. న్యాయ సంస్కరణలపై చర్చించేందుకు ధర్మాసనంలోని ఇతర న్యాయమూర్తులతో సహా హాజరు కావాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తిని ప్రధాని ముఖ్య కార్యదర్శి పిలవగలరా? ఒకవేళ అలా చేస్తే ఆయన కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కోవాల్సి వస్తుంది. తటస్థత, స్వతంత్రత విషయాలలో సుప్రీంకోర్టుకు, ఎన్నికల కమిషన్‌కు మధ్య తేడా ఏమీ ఉండదు. ఈ రెండూ స్వతంత్ర, రాజ్యాంగ సంస్థలే. కార్యనిర్వాహక వ్యవస్థతో సంబంధం లేనివే. సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారో, దానిలో ఏమి చర్చిస్తారో తెలియకుండా ప్రధాని ముఖ్య కార్యదర్శి ఈసీకి కనీసం ఫోన్‌ కూడా చేయకూడదు. రాజకీయ నాయకులు ప్రతిరోజూ పిటిషన్లు, ఫిర్యాదులు, సూచనలతో ఎన్నికల కమిషన్‌ను కలుస్తుంటారు. అయితే అదంతా పారదర్శకంగా జరుగుతుంది.
ప్రొటోకాల్‌ విషయానికి వస్తే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ తొమ్మిదో స్థానంలో ఉండగా, ప్రధాని ముఖ్య కార్యదర్శి 23వ స్థానంలో ఉన్నారు. మరి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఉన్నత స్థాయి వ్యక్తిని ఓ అధికారితో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఎలా పిలుస్తారు? చట్టపరమైన, రాజ్యాంగ పరమైన వ్యవహారాలలో ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే న్యాయ మంత్రిత్వ శాఖకు ఈ విషయం తెలియదా?
ముందుకు సాగని సంస్కరణల ప్రక్రియ
మన్మోహన్‌ ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన వీరప్ప మొయిలీ ఒక రోజు ఖురేషీకి ఫోన్‌ చేశారు. ‘మీరు ఎన్నికల సంస్కరణల గురించి ప్రస్తావిస్తు న్నారు. మీరు నా కార్యాలయానికి టీ తాగడానికి ఎందుకు రాకూడదు? వస్తే సంస్కరణలపై చర్చిద్దాము’ అని సూచిం చారు. ఈ ఆహ్వానాన్ని ఖురేషీ తోసిపుచ్చారు. పైగా ఈసీ కార్యాలయానికి రావాల్సిందిగా మొయిలీనే ఆహ్వానిం చారు. దీనికి ఓకే చెప్పిన మొయిలీ ఆ మర్నాడు నలుగురు అధికారులతో కలిసి ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి వెళ్లారు. అయితే కేవలం మూడు గంటలు చర్చిస్తే ఒరిగేదే ముంటుంది? ఆ తర్వాత కూడా సంప్రదింపులు కొనసాగా యి. సంస్కరణలు కార్యరూపం దాల్చే సమయానికి మొయిలీని వేరే మంత్రిత్వ శాఖకు మార్చారు. జాతీయ ఏకాభిప్రాయం కోసం మొయిలీ ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయనను మార్చి సల్మాన్‌ ఖుర్షీద్‌ను న్యాయ శాఖ మంత్రిగా నియమించడంపై నిరసన తెలుపుతూ ప్రధానికి ఖురేషీ ఫోన్‌ చేశారు. అయితే దీనిని మన్మోహన్‌ తేలికగా తీసుకు న్నారు. ఆందోళన చెందవద్దని, మొయిలీ మొదలు పెట్టిన పనిని ఖుర్షీద్‌ ముందుకు తీసికెళతారని చెప్పారు. ఆ తర్వాత ఖుర్షీద్‌ ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి వెళ్లి చర్చలు జరిపినప్పటికీ సంస్కరణల ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇవన్నీ స్వయంగా ఎలక్షన్‌ కమిషన్‌ మాజీ చీఫ్‌ ఎస్‌వై ఖురేషీయే చెప్పడం గమనార్హం. ఆయన రాసిన ”ఇండియాస్‌ ఎక్స్‌పర్మెంట్‌ విత్‌ డెమోక్రసీ : ది లైఫ్‌ ఆఫ్‌ ఏ నేషన్‌ త్రూ ఇట్స్‌ ఎలక్షన్స్‌” అనే పుస్తకంలో ఇలాంటి విషయాలనేకం చెప్పారు. ఎన్నికలకు ముందు ప్రధాని కార్యాలయ ముఖ్య కార్యదర్శితో పీఎంఓలో కానీ, ఈసీ కార్యాలయంలో కానీ సమావేశం కావడం అనేక అన వసరపు అనుమానాలకు తావిస్తుంది. దేనిపై చర్చించారో ఎవరికి తెలుసు? ఎన్నికల తేదీలపైనా లేదా మరే విష యంపైనా? ఇలాంటి ఉదంతాలు పునరావృతం కావడం మంచిది కాదు.