పారదర్శకతే పాలనాధికారి ప్రధాన ధ్యేయం

– అధికారుల్లో జవాబుదారితనం పెంచుతున్న కలెక్టర్ 
– ప్రజావాణితో సమస్యల పరిష్కారానికి చొరవ 
– ఆకస్మిక తనిఖీలతో ప్రతి ఉద్యోగికి బాధ్యతల నివృత్తి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లా కలెక్టర్ గా సి. నారాయణ రెడ్డి  బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల్లోనే పాలనలో ప్రత్యేకతను చూపించారు. జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేస్తూ అధికారుల్లో జవాబుదారీతనం పెంచుతున్నారు. సమయానికి కార్యాలయానికి వస్తూ అక్కడ పనిచేస్తున్న సిబ్బందినీ అప్రమత్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేస్తూ అక్కడివారితో మమేకమై భరోసా కల్పిస్తున్నారు. అధికారిగా చేయాల్సిన పనులను తప్పకుండా చేస్తానని నమ్మకం కల్పిస్తున్నారు. మొదటి సమీక్ష సమావేశంలోనే ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. వారిచ్చిన సలహాలు, సూచనలు స్వీకరిస్తూనే అధికారులుగా తామేం చేయాలో దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అన్ని శాఖల అధికారులు కలిసి సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ధరణిపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తామని పనిచేయని అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని  చెప్పారు.
ఆకస్మిక తనిఖీలు.. ఐదుగురు సస్పెన్షన్
కలెక్టర్ నారాయణరెడ్డి విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నారు. గత నెల 16వ తేదీన విధుల్లో చేరిన నాటినుండి తనదైన శైలిలో అధికార, రోజువారి పాలనలో వినూత్నంగా వ్యవహరిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. గడిచిన నెలనర రోజుల్లోనే తన మార్కును చూపించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల తక్షణ పరిష్కారం కోసం అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడంతో పాటు రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను పక్కాగా అమలు చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన మూడు రోజులకే జూన్ 19న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసి రోగుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు వార్డ్ బాయ్ లను సస్పెండ్ చేశారు. వైద్యులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పై ప్రజలకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో వారానికి రెండు రోజులు  అధికారులు పర్యవేక్షణ ఏర్పాటు చేశారు.ఆ సమయంలో ఇది నచ్చని కొంతమంది వైద్యులు నిరసన చేపట్టినా  ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తూ సద్దుమనిగేల చేశారు.జూలై 11వ తేదీన తిప్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సమయంలో అనధికారికంగా విధులకు గైర్హాజరైన ఫార్మసిస్ట్ పై చర్యలు తీసుకోవాలని సూచించడంతో డీఎంహెచ్ఓ ఫార్మసిస్ట్ ను సస్పెండ్ చేశారు. జూలై 19వ తేదీన హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ హాజరు రిజిస్టర్ పరిశీలించారు. ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేశారు. 20వ తేదీన జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ మూడు రోజులుగా అనాధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న వ్యవసాయ శాఖ పాలన అధికారి (ఎఓ) ను సస్పెండ్ చేశారు.
కలెక్టరేట్ కు వెళ్లినా.. తనిఖీలకు వెళ్లినా
కలెక్టర్ నారాయణ రెడ్డి భిన్నమైన పనితీరును ప్రదర్శిస్తున్నారు. కలెక్టరేట్ కు వెళ్లినా, ఇతర కార్యాలయాలకు తనిఖీలకు వెళ్లినా ఉన్నతాధికారిననే గర్వాన్ని ఏ మాత్రం ప్రదర్శించడం లేదు. అక్కడున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారు. విద్య, వైద్యంపై ప్రధానంగా దృష్టి సారించి అనేక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. కలెక్టరేట్ లో సైతం సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రతీ ఒక్కరినీ కలుస్తూ ఓర్పుగా సమాధానం చెబుతున్నారు. నల్లగొండ జిల్లాలో తన మార్కు పాలనగా అడుగులు వేస్తున్నారు.
వీటిపై మరింత దృష్టి అవసరం..
జిల్లాలో ప్రధానంగా పెండింగ్ లో ఉన్న ధరణి తో  సమస్యలపై కలెక్టర్ మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా అనేక రకాలైన భూ సమస్యలు కూడా కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయి. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను కాపాల్సిన బాధ్యత కూడా ఉంది. గత ప్రభుత్వ హయాంలో భూములకు సంబంధించి అనేక అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయి. వాటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్ పైనే ఉంది. ఇవే కాకుండా వివిధ శాఖల్లో అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. వారిపై కూడా దృష్టిపెట్టి పాలనను గాడిలో పెట్టాలి. కొత్త ప్రభుత్వం, జిల్లాకు కొత్త పాలనాధికారిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్న వాస్తవాన్ని గమనించాలి.
టాస్క్ ఫోర్స్ బృందాలు ఏమయ్యాయి.. అసలు పని చేస్తున్నాయా..!
గతంలో జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు టాస్క్ ఫోర్స్ ను ఉపయోగించి అనేక ప్రదేశాలలోని అవినీతిని బయటకు తీశారు. దాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నట్లయితే ప్రజలకు సరైన సమయంలో సేవలు అందటమే కాకుండా అవినీతి నిర్మూలన జరిగే అవకాశం ఉందని సంఘసంస్కర్తలు, రిటైర్డ్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఉన్నత స్థాయి అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేసినప్పుడు తప్పుచేసే అధికారులు భయపడే అవకాశం ఉంటుంది. తప్పు చేయడానికి వెనకడుగు వేసే అవకాశం ఉంది. అప్పుడు ప్రజలకు అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి. అవినీతి అనేదానికి తావు  ఉండకుండా ఉంటుంది. అవినీతి, అక్రమాలు జరగకుండా ఉండాలంటే టాస్క్ ఫోర్స్ బృందాలు పనిచేయాలి. టాస్క్ ఫోర్స్ బృందాలు అసలు ఏమయ్యాయి? ఉంటే పని చేస్తున్నాయా అని జిల్లా ప్రజలు, సంఘసంస్కర్తలు, విద్యావేత్తలు,  విశ్రాంతి ఉన్నత ఉద్యోగులు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇకనైనా మరి టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందేమో వేచి చూద్దాం.