– ‘హిట్ అండ్ రన్’ చట్టాన్ని అమలు చేయొద్దు :డ్రైవర్ల డిమాండ్
నవతెలంగాణ- విలేకరులు
రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని జిల్లాల్లో గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టి అధికారులకు వినతులు అందజేశారు. హిట్ అండ్ రన్ చట్టాన్ని అమలు చేయొద్దని కోరారు. ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం ఏఐఆర్‌టీడ బ్ల్యూఎఫ్ హైదరాబాద్ సౌత్, సెంట్రల్ సిటీ కమిటీ నాయకులు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి ట్రాన్స్‌పోర్టు కార్మికుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ట్రాన్స్‌పోర్టు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్, సెంట్రల్ సిటీ కార్యదర్శి కె.అజయ్ బాబు, సౌత్ కార్యదర్శి ఎల్.కోటయ్య, టీఆర్‌సీపీటీయూ రాష్ట్ర అధ్యక్షులు కె.సతీష్, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ నగర నాయకులు ఎండీ ఆసిఫ్, అలీ అబ్బాస్, ఎండీ బాబా పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలోని అన్ని రకాల వాహనాల డ్రైవర్లు నగరంలోని తెలంగాణ చౌక్ నుంచి ర్యాలీ చేసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, ఆల్ డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పున్నం రవి మాట్లాడుతూ.. రవాణారంగ కార్మికులకు గీత, నేత కార్మికుల వలే నెలకి రూ.4500 నిరుద్యోగ భృతి చెల్లించాలన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, డ్రైవర్లకు నష్టం చేసే ‘భారత న్యాయ సంహిత’ చట్టంలోని సెక్షన్ 106(1)(2) ఎత్తేయాలన్నారు. ‘హిట్ అండ్ రన్’ చట్టం అమల్లోకి వస్తే డ్రైవర్ల బతుకులు జైలు పాలువుతాయని.. వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి ఏవోకి వినతిపత్రం అందజే శారు. తెలంగాణ పబ్లిక్ ప్రయివేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కురుమూర్తి, ప్రధాన కార్యదర్శి పొదిల రామయ్య పాల్గొన్నారు.