– బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తు అన్నవారిని చెప్పుతో కొట్టండి
– కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు : కేంద్ర మంత్రి బీఎల్ వర్మ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
– తాండూరులో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం
నవతెలంగాణ-తాండూరు
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో కాళేశ్వరంలో జరిగిన కుంభకోణంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. మీడియాకు లీకులు ఇస్తూ లేనిపోని ప్రచారాలు చేస్తున్న వారికి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో బీజేపీ పొత్తు పెట్టుకోలేదని, ఇప్పుడు ఓడిపోయిన పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటామని, పొత్తు ఉంటుందన్న వారిని చెప్పుతో కొట్టాలన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా తాండూర్ పట్టణ కేంద్రంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్‌పై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉంటే కేసీఆర్‌ను ఇప్పటికే జైల్లో పెట్టేవాళ్లమన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, కృష్ణా జలాల అప్పగింతపై రెండు పార్టీలు విమర్శలు చేసుకుంటూ అసెంబ్లీలో టైపాస్ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కేసీఆర్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేంద్రంలో కచ్ఛితంగా మూడోసారి మోడీ ప్రభుత్వం వస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ, జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, సీనియర్ నాయకులు యు.రమేష్ కుమార్, ఎం.నరేష్‌మహరాజ్, గాజుల శాంతుకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు బాలి శివకుమార్, అంతారం లలిత, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, కౌన్సిలర్ సాహు శ్రీలత, అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.