– 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ- భువనగిరిరూరల్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ గ్రామాల నుండి పోతున్న త్రిబుల్ ఆర్ అలైన్ మెంట్ మార్చి, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇచ్చి, సర్వం భూమి కోల్పోతున్న రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట భూ బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజు కొనసాగింది. ఈ దీక్షలకు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ తరఫున ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించి మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే బస్వాపురం ప్రాజెక్టుతో, కాలువలతో, బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి పల్లి కాలువతో, జాతీయ రహదారితో చాలా పెద్ద ఎత్తున రైతులు తమ భూములను కోల్పోయిన పరిస్థితి ఉందన్నారు. మరోపక్క త్రిబుల్ ఆర్ పేరుతో ఉన్న కాస్త భూములు కూడా దక్కే పరిస్థితి లేదని ఆవేదన వెలుబుచ్చారు. మన తెలంగాణ ప్రాంతంలోని నాలుగు జిల్లాలు కలుపుకొని 20 మండలాల్లో 120 గ్రామాల నుండి 100 కిలోమీటర్ల పైగా త్రిబుల్ ఆర్ రోడ్డు పోవడంతో 4000 ఎకరాలకు పైగా రైతులు తమ భూములను కోల్పోతున్న పరిస్థితి ఉన్నదని దీనితో రైతులతో పాటు దాని మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడందన్నారు. ఇప్పటికైనా పాలకులు తమ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో భూ బాధితులకు న్యాయం జరిగే వరకు సంపూర్ణ మద్దతు తెలియజేసి పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.