చెట్టు సాక్ష్యం

చెట్టు సాక్ష్యంఐదవ తరగతి చదువుతున్న వినరు స్కూల్‌ నుండి రాగానే బ్యాగ్‌ని బాల్కనీలో పడేసి బాధగా ఇంట్లోకి వచ్చేడు.
”ఏమైంది వినరు అలా వున్నావు?” అని అమ్మ తలని తడుముతూ అడిగింది.
”మా కొత్త తెలుగు సార్‌ ఒక్కొక్కరిని లేపి ఒక కథ చెప్పమన్నారు. అందరూ చెప్పారు. నేను చెప్పలేక పోయాను సిగ్గేసింది” అని బదులిచ్చాడు.
”అయ్యో ఇంతేనా.. ఇంకేమోనని కంగారు పడ్డాను. ఐరాల నుండి మీ తాత వచ్చారు. రాత్రికి కథ చెపుతారు గానీ ఫ్రెష్షై రా. స్నాక్స్‌ తిని హోమ్‌ వర్క్‌ కంప్లీట్‌ చేద్దువు” అంటూ కిచెన్లోకి వెళ్ళింది.
వినరుకి ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందానని ఆతురతో త్వరత్వరగా పనులు పూర్తి చేసుకున్నాడు.
రాత్రి భోజనాలు అయ్యాక తాత, మనవడు మిద్దె మీద పడక వేసుకున్నారు. తాత పడక మీద నడుం వాల్చాడు. వినరు తాత పొట్ట మీద కూర్చోని కథ చెప్పమన్నాడు. ఉండరా చెపుతానని వక్కపలుకు నోట్లో వేసుకొని నములుతూ మనవడిని పొట్టమీద నుండి లేపి, మోకాళ్ళు మడిచి కాళ్ళపై వేసుకుని ఊయలలూపుతూ కథ చెప్పడం మొదలెట్టాడు.
రామాపురంలోని రామయ్య, సోమయ్య ఇద్దరూ మంచి మిత్రులు. వానలు కురవక కరువొచ్చి ఊరంతా ఆకలితో మాడి పోతున్నది. ఇద్దరు మిత్రులు చంద్రగిరికి పనుల కోసం వలసి పోయారు. చంద్రగిరిలో ఇల్లు కట్టేదానికి పునాదులు తవ్వే పని దొరికింది. పగలు పని చూసుకొని రాత్రిపూట చంద్రగిరికోటలో పడుకొనేవారు. ఇక మూడురోజులు పని చేస్తే వారం కూలీ ఇస్తారు. ఆదివారం పనికి సెలవు కాబట్టి ఐరాల కెళ్ళి దుడ్లు ఇచ్చి రావాలనుకున్నారు. ఐదోరోజు పునాదులు తవ్వుతుంటే లంకెబిందె దొరికింది. బిందె నిండా బంగారు ఆభరణాలు. ఎవ్వరూ చూడలేదు కాబట్టి రహస్యంగా ఓ పొదలో దాచిపెట్టారు. వారం రోజుల కూలీ దుడ్లు తీసుకొని పాతగోనె సంచిలో లంకెబిందెను దాచుకొని, చంద్రగిరిలో రైలెక్కి పాకాలలో దిగి ఐరాలకు నడవడం మొదలెట్టారు. దామలచెరువు కాడికొచ్చాక మర్రిచెట్టు నీడలో అలుపు తీర్చుకోవడానికి ఆగారు. రామయ్య అలసటతో నిద్రపోయాడు. సోమయ్యకు కుట్రబుద్ధితో నిద్రపట్ట లేదు. రామయ్య అడ్డుతొలిగించుకుంటే లంకెబిందె తన సొంతం అవుతుందని, రామయ్య గుండెలమీద బండ వేశాడు.
రామయ్య నెత్తురు కక్కుకుంటూ ”మిత్రద్రోహీ ఈ చెట్టే సాక్ష్యం నీవు ఇంతకింతకూ శిక్ష అనుభవించే తీరుతావని” అంటూ చనిపోయాడు. సోమయ్య గబగబా రామయ్య శవాన్ని పారే ఏటిలో పారేశాడు. చూస్తుండగానే రామయ్య శవం కొట్టుకు పోయింది. సోమయ్య రామాపురం వెళ్ళి ఆనందంగా బతుకుతున్నాడు.
సంవత్సరం తరువాత సోమయ్య తన పెళ్ళాంతో ఊరెళుతూ మర్రిచెట్టు దగ్గర ఆగి పకపకా నవ్వాడు. ఎందుకయ్యా నవ్వుతున్నావని అడిగిన భార్యకు రామయ్య కథ చెప్పి ”ఏదీ నోరు లేని చెట్టు సాక్ష్యం చెప్పిందా” అని పడిపడీ నవ్వాడు. సోమయ్య పెళ్ళాం పక్కింటి సీతమ్మతో ఎవ్వరికీ చెప్పొద్దు అంటూ రామయ్యకథ చెప్పేసింది. ఆనోటా ఈనోటా పడి అందరికీ తెలిసిపోయి సోమయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ”సత్యాన్ని ఎంతలోతు గోతి తీసి పాతి పెట్టినా ఏదో ఒకనాటికి బయట పడుతుంది” అని తాత కథ ముగించాడు. వినరు ఆనందంతో తాతను కౌగిలించుకుని నిద్రలోకి జారుకున్నాడు.
– సురేంద్ర రొడ్డ , 9491523570