– 6 జిల్లాల్లో 18 వేల మొక్కలు నాటినందుకు గుర్తింపు
నవతెలంగాణ-జైపూర్
సింగరేణి సీఎండీ బలరామ్‌నాయక్‌కు ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు వరించింది.సింగరేణి సంస్థను పర్యావరణ హిత సంస్థగా మార్చడమే కాకుండా అందరిలోనూ పర్యావరణ స్పూర్తిని నింపేందుకు స్వయంగా సింగరేణి పరిధిలోని 6 జిల్లాల్లో 18 వేలకు పైగా మొక్కలు నాటి చిట్టడువులు స్థాపించిన సింగరేణి సీఎండీ అవార్డును అందుకున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రీన్ మ్యాపుల్ పౌండేషన్-2024 అవార్డుల ప్రదానోత్సవంలో ఆ సంస్థ ఎండీ ఆశుతోష్ వర్మ, ఎన్టీపీసీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నతాధికారులు సింగరేణి సీఎండీ బలరామ్‌కు ఈ అవార్డును అందజేశారు. దేశంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ప్రభుత్వ, ప్రయివేటు రంగ సంస్థలు అందులోని ప్రభావశీల వ్యక్తులకు గ్రీన్ మ్యాపుల్ వారు ప్రతి సంవత్సరం ఇటువంటి ప్రోత్సాహక అవార్డులు అందజేస్తున్నారు. సివిల్ సర్వీసెస్ అధికారిగా ఉన్నత స్థాయిలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ పర్యావణ పరిరక్షణ కోసం ఒక్కడే 18 వేల మొక్కలు నాటి మినీ ఫారెస్ట్‌ను సృష్టించడం దేశంలోనే అత్యంత అరుదని ఈ సంధర్భంగా వక్తలు కొనియాడారు. బొగ్గు ఉత్పత్తి చేస్తున్న తమ సంస్థ నిబంధనల ప్రకారం పచ్చదనాన్ని కాపాడటంతో పాటు స్వచందంగా పర్యావరణ పరిరక్షణకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని, సింగరేణి వ్యాప్తంగా 6 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు సీఎండీ బలరామ్ ఈ సంధర్భంగా వెల్లడించారు. సింగరేణి సంస్థ చేస్తున్న పర్యావరణ హిత చర్యలకు గుర్తింపుగా 2021-22 సంవత్సరంలో కార్మన్ న్యూట్రాలిటీ కంపెనీగా సీఎం పీడీఐ గుర్తించిందని తెలిపారు.