పార్ములా ఈ-రేస్‌పై న్యాయవిచారణ

On the Formula One race trial– ఈవెంట్‌ నిర్వహించిన కంపెనీకి రూ.110కోట్లు లబ్ది
– ప్రభుత్వానికి ఆదాయం శూన్యం
– నిబంధనలకు విరుద్ధంగా నిధుల కేటాయింపు
– వారి కోరికల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఫార్ములా ఈ-రేస్‌ నిర్వహణపై న్యాయవిచారణ జరిపిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని వాడుకున్నారనీ, ఫార్ములా ఈ-రేస్‌ నిర్వహణ అందులో భాగమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ-రేస్‌ను రద్దు చేస్తే మాజీ మంత్రులు హైదరాబాద్‌కు నష్టం జరిగిందని అంటున్నారనీ, అసలు ఈ-రేస్‌ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కలిగిన ప్రయోజనం, వచ్చిన ఆదాయం ఏమిటో చెప్పకుండా గగ్గోలు పెడుతున్నారని అన్నారు. ఫార్ములా ఈ-రేస్‌ ఈవెంట్‌ పేమేంట్‌ బిజినెస్‌ రూల్స్‌కు భిన్నంగా జరిగిందని స్పష్టంచేశారు. ఈవెంట్‌ నిర్వహించిన కంపెనీ రూ. 110 కోట్లు లబ్ది పొందిందనీ, ఫార్ములా ఈ-రేస్‌ టికెట్లు అమ్ముకొన్న నెక్స్‌జెన్‌ సంస్థ ఆర్థికంగా లాభపడిందని తెలిపారు. ఫార్ములా ఈ-రేస్‌ ఈవెంట్‌ నిర్వహణా సౌకర్యాల కోసం నిధులు వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం రాలేదని చెప్పారు. ఈవెంట్‌ కోసం త్రైపాక్షిక ఒప్పందాన్ని కాదని ద్వైపాక్షిక ఒప్పందం ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం లేకుండా, సంబంధిత శాఖ మంత్రి అనుమతి లేకుండా మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ రూ. 55 కోట్లు చెల్లించారని తెలిపారు. ఈవెంట్‌ నిర్వహణకు రూ.110 కోట్లకు ఫార్ములా ఈ-కంపెనీ ఒప్పుకుందనీ, దానిలో రూ.55 కోట్లు చెల్లించగా, మిగిలిన రూ. 55 కోట్లు ఇవ్వాలని నోటీసులు ఇచ్చిందని వివరించారు. ఈ రేస్‌ వల్ల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఏమీ లేదన్నారు. గత పాలకులు వారి కోరికలు తీర్చుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు.ఈ రేస్‌ను రద్దు చేయడం వల్ల హైదరాబాద్‌ ఇమేజ్‌ తగ్గిందంటూ రాష్ట్రాన్ని పచ్చిగా అమ్మకానికి పెట్టిన మాజీ మంత్రి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వాన్ని సొంత అవసరాలకోసం వాడుకున్నా రనీ, ఫార్ములా ఈ-రేస్‌ టిక్కెట్లు అమ్ముకొని అగ్రిమెంట్‌ నుంచి వైదొలిగిన నెక్స్‌జెన్‌ సంస్థ ఎవరిది? దీని వెనుక ఎవరు ఉన్నారనే విషయాలను మళ్లీ చెప్తామన్నారు.
దశలవారీగా రైతుబంధు
రైతుబంధుకి రోజు వారీగా నిధులు విడుదల చేస్తున్నాం. ఒక ఎకరం ఉన్న రైతులకు ఇప్పటికే రైతు బంధు ఇచ్చాం. రెండు ఎకరాలున్న రైతులకు ఇప్పుడు చెల్లిస్తున్నాం. తెలిపారు. విడతల వారీగా రైతులకు రైతుబంధు నిధులు ఇస్తాం.
ఎవరైనా కలవొచ్చు…
ప్రజాభవన్‌లో ఎవరైనా ప్రతి రోజు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య కలవొచ్చు. సంపద సృష్టించి, దాన్ని ప్రజలకే పంచుతాం.